India vs England: అరుదైన రికార్డు ముంగిట పుజారా.. మరో 45 పరుగులు చేస్తే!!

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక గురువారం నుంచి మొతెరాలో ఆఖరి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే చివరి మ్యాచ్ ముందు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. నాలుగో టెస్టు మ్యాచ్‌లో పుజారా 45 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 1000 పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు.

45 పరుగులు చేస్తే:
ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అగ్ర స్థానంలో ఉన్నాడు. 22 టెస్టుల్లో 1331 పరుగులతో సన్నీ టాప్‌లో కొనసాగుతున్నాడు. గుండప్ప విశ్వనాథ్ 17 టెస్టుల్లో 1022 పరుగులతో రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ 12 టెస్టుల్లో 1015 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై 12 టెస్టులు ఆడిన చతేశ్వర్ పుజారా 955 పరుగులు చేశాడు. నాలుగో టెస్టులో 45 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 1000 పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా పుజారా నిలవనున్నాడు.

టెండూల్కర్‌కు కూడా సాధ్యం కాలేదు:
ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 1000 పరుగులు చేయడం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు కూడా సాధ్యం కాలేదు. సచిన్ 15 టెస్టుల్లో 960 పరుగులు మాత్రమే చేశాడు. 2012లో అహ్మదాబాద్ వేదికగానే ఇంగ్లండ్‌పై చతేశ్వర్ పుజారా 201 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత్ తరఫున పుజారా కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 84 టెస్టులు ఆడి 6227 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 206. ఇక ఇంగ్లండ్‌తో ఇప్పటికే మూడు టెస్టులు ఆడిన పుజారా కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు.

కోహ్లీ కూడా:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చివరి టెస్టులో కొన్ని ఘనతలు అందుకునే అవకాశాలున్నాయి. భారత్ తరఫున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన ఎంఎస్ ధోనీ (60 టెస్టులు) రికార్డును అహ్మదాబాద్‌లో కోహ్లీ సమం చేయనున్నాడు. విరాట్ మరో 17 పరుగులు చేస్తే.. కెప్టెన్‌గా 12000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకుంటాడు. కోహ్లీ కన్నా ముందు రికీ పాంటింగ్ (15440), గ్రేమ్ స్మిత్ మాత్రమే (14878) ఈ ఘనత సాధించారు. సెంచరీ చేస్తే కెప్టెన్‌గా అత్యధిక శతకాలు (అన్ని ఫార్మాట్లలో కలిపి) సాధించిన సారథిగా రికీ పాంటింగ్ (41)ను విరాట్ కోహ్లీ దాటేస్తాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications