
నాపై నాకే చిరాకేసింది
నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిశాక బెన్ స్టోక్స్ మీడియాతో మాట్లాడాడు. 'క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత ఔటవ్వడం నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. హాఫ్ సెంచరీ సాధించడం పెద్ద స్కోరేమీ కాదు. దాంతో టెస్టు మ్యాచులు గెలవలేం. ఇలాంటి వికెట్‌పై ఔటవ్వడం చిరాకుగా అనిపించింది. రెండున్నర గంటలు బంతిని డిఫెండ్ చేసి సౌకర్యంగా అనిపించిన తర్వాత టర్న్ అవ్వని బంతికి వికెట్ ఇచ్చేశాను. అంతకుముందు వరకు నేరుగా వచ్చే బంతికి వికెట్ ఇవ్వొద్దని బలంగా కోరుకున్నాను. అందుకే నాపై నాకే చిరాకుగా అనిపించింది' అని స్టోక్స్ తెలిపాడు.

70 మ్యాచులు ఆడుంటాను
'తొలి ఇన్నింగ్స్‌లో మేం జాగ్రత్తగా ఆడి మరిన్ని పరుగులు చేయాల్సింది. కానీ అలా కుదరలేదు. ఏదేమైనా ఆట ఆఖర్లో మాకు శుభ్‌మాన్ గిల్ వికెట్ దక్కడం బాగుంది. రెండో రోజు భారత ఆటగాళ్లను త్వరగా ఔట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మా బౌలింగ్ విభాగం శ్రమించాల్సి ఉంది. ఇక నేనిప్పటి వరకు దాదాపుగా 70 టెస్ట్ మ్యాచులు ఆడుంటాను. ఒక బ్యాట్స్‌మన్‌గా నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరిస్థితులు ఇవేనని జట్టులో మిగతా వాళ్లకు చెప్పాను. ఒక్కో బ్యాట్స్‌మన్‌కు ఒక్కో పాత్ర ఉంటుంది. మళ్లీ ఇక్కడికొచ్చినప్పుడు మరింత మెరుగై రావాలి' అని ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు.

అశ్విన్ అద్భుతమైన బౌలర్
హాఫ్ సెంచరీ అనంతరం స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ పెవిలియన్ చేరాడు. దీనిపై మాట్లాడుతూ... 'భారత్‌కు వచ్చినప్పుడు ఆర్ అశ్విన్ బౌలింగ్‌నే ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అతడి చేతుల్లోనే ఔటయ్యే అవకాశాలు ఎక్కువ. అతడు నన్ను ఎక్కువసార్లు ఔట్ చేశాడన్న గణాంకాలు నేను చదవలేదు. ఏదేమైనా అశ్విన్ అద్భుతమైన బౌలర్. పిచ్ మాత్రం మూడో టెస్టు కన్నా చాలా బాగుంది. అందుకే బాగా ఆడనందుకు నిరాశపడ్డాం' అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

205 పరుగులకు ఆలౌట్
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 205 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకం చేయగా.. లారెన్స్ (46; 8 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (4/68), ఆర్ అశ్విన్ (3/47) మరోసారి మాయ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ గురువారం ఆట ముగిసే సమయానికి గిల్ (0) వికెట్ కోల్పోయి 24 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్కోరుకు 181 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం రోహిత్ (8), పుజారా (15) క్రీజులో ఉన్నారు.
వికెట్ తీయగానే.. జెర్సీ విప్పేసిన సీనియర్ స్పిన్నర్! అసలు కారణం ఇదే (వీడియో)!