

హైదరాబాద్: ఓవల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో తన ఒంటరి పోరాటంతో టీమిండియాను గట్టెక్కించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత టాపార్డర్ చేతులెత్తేయగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రవీంద్ర జడేజా, అరంగేట్ర ఆటగాడు హనుమ విహారితో కలిసి 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఈ భాగస్వామ్యం ఆతిథ్య ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని చాలా వరకు తగ్గించింది. లంచ్ విరామ సమయానికి ముందు అలీ బౌలింగ్‌లో హనుమ విహారి ఔటైన తర్వాత అవతలి బ్యాట్స్‌మెన్‌కు అవకాశమివ్వకుండా జడేజా ఆడిన తీరుని మాజీ దిగ్గజాలు సైతం ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో 113 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో జడేజా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
దీంతో భారత్ 292 పరుగులు చేయగలిగింది. జడేజా (156 బంతుల్లో 86) పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆధిపత్యానికి గండిపడింది. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా అటు బంతితో సైతం రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా బంతితో నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరిస్‌లో ముందు జరిగిన మ్యాచ్‌ల్లో జడేజాను ఆడిపిస్తే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు.
ఐదో టెస్టులో జడేజా ఆటపై వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. "వెల్‌డన్ జడేజా.. నీవు ముందే ఈ సిరీస్‌లో ఆడుంటే ఫలితం మరోలా ఉండేది. 4 వికెట్లతో పాటు అద్భత హాఫ్ సెంచరీ సాధించావు.. అలాగే రాణించు" అని ట్విటర్‌లో ట్వీట్ చేశాడు.
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ సైతం జడేజా ప్రదర్శనను కొనియాడాడు. "జడేజా ఆటతీరు ఆకట్టుకుంది. అన్ని సమయాల్లో అతన్ని ఆడించాలని భారత్ ఎలా గ్రహిస్తుందో.. గొప్ప నైపుణ్యం కలిగిన ఆటగాడు" అని ట్వీట్ చేశాడు.