చెన్నై: ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ భారీ శతకంతో చెలగరేగిపోయాడు. అతడికిది కెరీర్లో నాలుగో శతకం కావడం విశేషం. అయితే అతడు ఒకే ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో వరుస వైఫల్యాలలో విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ చివరి టెస్ట్‌లో తనదైన శైలిలో రెచ్చిపోయాడు.
ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన రాహుల్ (199) భారీ శతకం సాధించాడు. 311 బంతుల్లో 16ఫోర్లు, 3సిక్సర్లతో రాహుల్ 199 పరుగుల మార్కును చేరాడు. ఆదివారం ఆట తొలి సెషన్, రెండో సెషన్ లో రాహుల్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.
గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలుపుకుని 104 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. ఈ మ్యాచ్‌లో దుమ్మురేపాడు. అంతకుముందు ఐదు ఇన్నింగ్స్ ల్లో 38 పరుగుల అత్యధిక స్కోరును మాత్రమే కల్గి ఉన్న రాహుల్.. ఒక్కసారిగా పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. తన టెస్టు కెరీర్ లో నాల్గో సెంచరీ సాధించిన రాహుల్..150 పరుగులను రెండోసారి సాధించాడు.

60/0 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కు మంచి ఆరంభం లభించింది. రాహుల్ కు జతగా మరో ఓవర్ నైట్ ఆటగాడు పార్థీవ్ పటేల్(71;112 బంతుల్లో7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ జోడి 152 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత పార్థీవ్ తొలి వికెట్ గా ఔటయ్యాడు.
అనంతరం పూజారాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నడిపించాడు. ఆపై విరాట్ కోహ్లి(15) నిరాశపరచడంతో భారత జట్టు 211 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. ఈ తరుణంలో రాహుల్-కరుణ్ నాయర్‌ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది.
ఈ జోడి 100 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్ తిరిగి గాడిలో పడింది. ఈ క్రమంలోనే టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు.ఇప్పటివరకూ టెస్టుల్లో రాహుల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 158 పరుగులు కాగా, దాన్ని ఈ మ్యాచ్ లో అధిగమించాడు.
కాగా, 199 పరుగుల వద్ద రాహుల్.. రషీద్ బౌలింగ్ లో బట్టర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో రాహుల్ డబులు సెంచరీ మిస్ చేసుకున్నాడు. కాగా, మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 391 పరుగులు చేసింది. క్రీజులో నాయర్ 71, విజయ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 477కు 86 పరుగుల దూరంలో ఉంది భారత్.