అరుదైన రికార్డు: దిగ్గజాల సరసన తెలుగు క్రికెటర్ హనుమ విహారి


హైదరాబాద్: ఓవల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో తెలుగు క్రికెటర్ హను విహారి అరుదైన రికార్డుని నమోదు చేశాడు. అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే హనుమ విహారి హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో భారత క్రికెట్ మాజీ దిగ్గజాల సరసన నిలిచాడు.
ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన హనుమ విహారి క్లిష్ట సమయంలో హాఫ్ సెంచరీ సాధించి భారత్‌ను గట్టెక్కించాడు. దీంతో అరంగేట్రపు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన 26వ భారత క్రికెటర్‌గా హనుమ విహారి గుర్తింపు పొందాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు రసీ మోడీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఘనత అందుకున్నారు.
తాజాగా ఆ జాబితాలో హనుమ విహారి చోటు దక్కించుకున్నాడు. 1946లో రసీ మోడీ 57 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. 1996లో లార్డ్స్ టెస్ట్‌లో సౌరవ్ గంగూలీ 131 పరుగులు, రాహుల్ ద్రవిడ్ 95 పరుగులతో ఈ ఘనత సాధించారు. ఆటలో రెండో రోజైన శనివారం చివరి సెషన్‌లో భారత జట్టు 103/4తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన విహారి అద్భుత ప్రదర్శన చేశాడు.

ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన విహారి
104 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన హనుమ విహారి ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. అంతేకాదు జడేజాతో కలిసి ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల(73) భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్ జట్టు ఆధిక్యాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషించాడు. 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇంగ్లాండ్ బౌలర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో విహారి ఔటయ్యాడు.

ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచరీ
దీంతో పాటు అరంగేట్రం టెస్టులో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కనీసం హాఫ్ సెంచరీని సాధించిన ఐదో క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో రోహిత్ శర్మ, సురేశ్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్, ప్రవీణ్ ఆమ్రే ఉండగా తాజాగా ఈ జాబితాలో కూడా హనుమ విహారి చోటు దక్కించుకున్నాడు. జడేజా(86 నాటౌట్), విహారి(56) పరుగులతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగులు చేయగలిగింది.

పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన హనుమ విహారి
కాగా, చివరి టెస్టులో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా స్థానంలో హనుమ విహారిని తీసుకోవడంతో కొందరు మాజీ క్రికెటర్లు విమర్శించారు. టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా కరుణ్ నాయర్ ఇప్పటికే జట్టులో ఉండగా అదనపు బ్యాట్స్‌మన్‌గా వచ్చిన విహారిని ఆడించడం అవసరమా? అని మాజీ క్రికెట్ దిగ్గజం గవాస్కర్‌లాంటి వారు నేరుగానే ప్రశ్నించారు.

గవాస్కర్ విమర్శలకు బ్యాట్‌తోనే జవాబు
సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ అంటే సెలెక్టర్లకు ఇష్టం లేనట్టుగా ఉందంటూ... దీనిపై సెలక్టర్లు కరుణ్ నాయర్‌తో మాట్లాడాలని కూడా గవాస్కర్ సూచించాడు. అయితే మ్యాచ్‌కు ముందు తన గురించి ఎలాంటి అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, హనుమ విహారి క్రీజులోకి దిగి బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.

ఆరంభంలో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడినా
స్టువర్ట్ బ్రాడ్, ఆండర్సన్ విసిరిన పదునైన బంతులను చక్కటి డిఫెన్స్‌తో ఎదుర్కొంటూ తన బ్యాటింగ్ పరిణతిని ప్రదర్శించాడు. ఆరంభంలో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడినా... ఆ తర్వాత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటూ అరంగేట్ర మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్నాడు. దీంతో జట్టులో తన ఎంపిక నూటికి నూరుపాళ్లు సరైనదేనని నిరూపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications