రాహుల్, పంత్ సెంచరీలు వృథా: పోరాడి ఓడిన భారత్, 4-1తో సిరీస్ కైవసం


హైదరాబాద్: ఇంగ్లాండ్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలుపు కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో ఇంగ్లీషు గడ్డపై టెస్టు సిరీస్‌ను ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబరుచలేకపోయారు. ఫలితంగా సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా పరాజయంతో ముగించింది.
కేఎల్ రాహుల్ (224 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్ 149), రిషభ్ పంత్ (146 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 114) సెంచరీలతో గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించారు. ఒకానొక దశలో అనూహ్య ఫలితమూ వచ్చేలా కనిపించింది. ఆరో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఈ జోడీ ఆశలు రేకెత్తించింది.
కీలక సమయంలో ఆదిల్ రషీద్ (2/63) చక్కటి బంతితో రాహుల్‌ను ఔట్ చేసి భారత్ ఆశలకు తెరదించాడు. ఆ వెంటనే పంత్‌నూ పెవిలియన్ పంపి ఆతిథ్య జట్టుకు విజయాన్ని అందించాడు. 17 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 345 పరుగులకే ఆలౌటైంది.
దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన ఆఖరి టెస్టులో టీమిండియా 118 పరుగులతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ (3/45), శామ్ కర్రన్ (2/23) రాణించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టు మినహా అన్నింటిని గెల్చుకున్న ఇంగ్లండ్ 4-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
కెరీర్ చివరి టెస్టులో సెంచరీ సాధించిన ఆ జట్టు ఓపెనర్ అలిస్టర్ కుక్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కగా.... పరుగుల వరద పారించిన భారత కెప్టెన్ కోహ్లీ, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన శామ్ కర్రన్‌లకు సంయుక్తంగా 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' పురస్కారం లభించింది.

భారత్ 58/3 ఓవర్‌నైట్ స్కోరుతో
58/3 ఓవర్‌నైట్ స్కోరుతో భారీ లక్ష్యం కోసం చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్ ఊహించని విధంగా రాణించింది. రహానే (106 బంతుల్లో 37; 5 ఫోర్లు) తోడుగా రాహుల్ దూకుడుగా ఆడాడు. మొదటి ఓవర్ చివరి బంతిని బౌండరీకి పంపి కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ (57 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో వైస్ కెప్టెన్ రహానే అతడికి సహకరించాడు. తొలుత ఆచితూచి ఆడిన రాహుల్... ఇంగ్లాండ్ ప్రధాన బౌలర్లు అండర్సన్, బ్రాడ్ చెరో నాలుగు ఓవర్లు వేసి తప్పుకోవడంతో జోరు పెంచాడు.

మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించాక
రహానే కూడా బ్యాట్ ఝళిపించడంతో క్రమంగా పరుగులు రావడం మొదలైంది. అయితే, మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించాక రహానే... మొయిన్ అలీ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యాడు. ఆ వెంటనే స్టోక్స్ బౌలింగ్‌లో విహారి(0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. స్టోక్స్ వేసిన షార్ట్ పిచ్ బంతి హనుమ విహారి బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. దీంతో భారత్ ఒక పరుగు తేడాతో రెండు వికెట్లు కోల్పోయింది. కానీ రాహుల్ మాత్రం తన జోరును ఆపలేదు.

118 బంతుల్లోనే కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి
40వ ఓవర్‌లో రెండు ఫోర్లు, 41వ ఓవర్‌లో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్స్, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో 118 బంతుల్లోనే కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో అతడికిది ఐదో సెంచరీ. అప్పటికి జట్టు స్కోరు 152 కాగా... అందులో ఓపెనర్‌వే 101 ఉండటం గమనార్హం. లంచ్‌కు ముందు పంత్ సైతం అలీ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టాడు. 167/5తో భారత్ విరామానికి వెళ్లింది. లంచ్ తర్వాత రాహుల్ నెమ్మదించగా, పంత్ చెలరేగాడు. 78 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టోక్స్ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టాడు.

టెస్టుల్లో తొలి సెంచరీ సాధించిన రిషబ్ పంత్
సుదీర్ఘ సమయం తర్వాత అండర్సన్, బ్రాడ్ బౌలింగ్‌కు వచ్చినా వీరిని ఇబ్బంది పెట్టలేకపోయారు. చక్కటి డ్రైవ్స్‌తో పాటు ఆన్ సైడ్‌లో స్లాగ్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ జోడీ వన్డే తరహా ఆటతో దూసుకెళ్లడంతో భారత్ శిబిరంలో ఒక్కసారిగా విజయంపై ఆశలు రేగాయి. రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌తో 90ల్లోకి వచ్చిన పంత్... అతడి ఓవర్లోనే మరో సిక్స్‌తో ఘనంగా కెరీర్ తొలి సెంచరీ అందుకున్నాడు. ఆరో వికెట్‌కు అజేయంగా 177 పరుగుల భాగస్వామ్యంతో చకచకా లక్ష్యం వైపు కదులుతూ జట్టు టీ బ్రేక్‌కు వెళ్లింది.

అద్భుత బంతితో రాహుల్‌ని ఔట్ చేసిన రషీద్
టీ విరామం అనంతరం ఏడో ఓవర్లోనే రషీద్ దెబ్బకొట్టాడు. 82వ ఓవర్ తొలి బంతికి రాహుల్‌ను ఓ అద్భుత బంతికి రషీద్ బోల్తా కొట్టించాడు. వికెట్ ముందున్న రఫ్ ప్యాచ్‌లో పడిన బంతి అనూహ్యంగా మలుపు తిరిగింది. బ్యాక్ ఫుట్ ఆడాలనుకున్న రాహుల్‌ను తప్పిస్తూ బంతి ఆఫ్ స్టంప్‌ను పడగొట్టింది. దీంతో ఆరో వికెట్‌కు 204 పరుగుల అద్భుత భాగస్వామ్యానికి తెరపడింది. తన మరుసటి ఓవర్లో... పంత్ భారీ షాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో అలీకి క్యాచ్ ఇచ్చాడు.

గెలుపు సంబరాల్లో ఇంగ్లాండ్
కాసేపు పోరాడిన జడేజా(13), ఇషాంత్ శర్మ(5)లను శామ్ కర్రన్ పెవిలియన్‌కు చేర్చాడు. షమీ (0)ని అండర్సన్ బౌల్డ్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ సంబరాల్లో మునిగిపోయింది. ఐదో టెస్టులో గెలుపు లభించకున్నా, ఓటమి పరుగుల అంతరాన్ని తగ్గించడంలో రాహుల్-పంత్ జోడీ విజయవంతమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications