

హైదరాబాద్: ఓవల్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్ సెంచరీ నమోదు చేశాడు. ఇన్నింగ్స్ 70వ ఓవర్లో తెలుగు తేజం హనుమ విహారి వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న కుక్ బౌండరీకి తరలించడంతో కుక్ తన టెస్టు కెరీర్‌లో 33వ సెంచరీని నమోదు చేశాడు.
ఈ క్రమంలో అలెస్టర్ కుక్ అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా ఉన్న కుక్.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పరుగులు సాధించిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కరను వెనక్కి నెట్టాడు.
అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్ల జాబితాలో కుక్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటి వరకు 12400 టెస్టు పరుగులతో సంగక్కర ఐదో స్థానంలో ఉండేవాడు. అయితే తన కెరీర్ ఆఖరి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన కుక్.. కుమార సంగక్కరను అధిగమించాడు.
తన కెరీర్‌లో కుక్ ఆఖరి టెస్టు మ్యాచ్‌ని ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ తరవాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు కుక్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు కుక్ 12,254 పరుగులతో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉండేవాడు.
ఆఖరి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన కుక్.. తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగులు చేయగా.... ఇక రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ పూర్తిచేసి కుమార సంగక్కరను అధిగమించాడు. అలాగే ఆరంగేట్ర టెస్టులోనూ, ఆఖరి టెస్టులోనూ సెంచరీ సాధించిన ఐదో బ్యాట్స్‌మన్‌గానూ కుక్ చరిత్రకెక్కాడు.
తన మొదటి, ఆఖరి టెస్టు సెంచరీని కుక్ భారత జట్టుపైనే చేయడం విశేషం. 2006లో నాగ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టులో అంతర్జాతీయ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన అలెస్టర్ కుక్ 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఒకే జట్టుపై మొదటి, ఆఖరి టెస్టుల్లో సెంచరీ నమోదు చేసిన తొలి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌గా కాగా, మొత్తంగా మూడో బ్యాట్స్‌మెన్‌గా అలెస్టర్ కుక్ అరుదైన ఘనత సాధించాడు.
అయితే, ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ముగ్గురు బ్యాట్స్ మెన్లు లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ఈ ఫీట్‌ని అందుకున్నారు. టెస్టుల్లో కుక్‌కి ఇది 33వ సెంచరీ. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరిన కుక్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెంచరీ సాధించాడు.
సెంచరీ సాధించడంతో కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. కుక్ సెంచరీ చేయగానే గ్యాలరీ నుంచి అతని కుటుంబసభ్యులతో పాటు అభిమానుల చప్పట్లతో స్టేడియం హోరెత్తింది. సెంచరీ అనంతరం బ్యాట్‌ను గాల్లోకి లేపి కుక్ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.