
రహానే ఏం చేస్తాడు:
లీడ్స్‌లో ఎదురైన దారుణ ఓటమి నుంచి తేరుకుని.. నాలుగో టెస్టులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో భారత్ ఉంది. మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ రాణించడం.. మూడో మ్యాచ్ ద్వారా టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారా ఫామ్ అందుకోవడం కాస్త సానుకూలాంశం. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. ముఖ్యంగా లార్డ్స్‌లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్న రహానే.. మూడో టెస్టులో నిరాశపరిచాడు. అయినా యాజమాన్యం అతడికి మరో అవకాశం ఇచ్చింది. గత రెండు సంవత్సరాలుగా జింక్స్ నిలకడలేమితో సతమతమవుతున్నాడు. అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెల్‌బోర్న్‌లో శతకం, లార్డ్స్‌లో అర్ధ శతకం చేసినా.. అతడు మునుపటి ఫామ్‌ను అందుకోలేక పోతున్నాడు. ఈ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 19 సగటుతో 95 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియా అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.

అశ్విన్‌పైనే ఆశలు:
అద్భుత ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, హనుమ విహారి వంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటే.. మిడిలార్డర్‌కు కొత్తదనం వస్తుంది. ఒకవేళ అజింక్య రహానేను తప్పిస్తే అతడి స్థానంలో ఆఫ్ స్పిన్నర్ హనుమ విహారిని తీసుకునే అవకాశం ఉంది. అయితే అదనపు బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగాలని దిగ్గజ క్రికెటర్‌లు సూచించినా విరాట్ కోహ్లీ అటువైపు ఆసక్తి చూపడం లేదు. మరి హనుమకు చోటు దక్కుతుందో లేదో చూడాలి. నాలుగో టెస్టు కోసం జట్టులోకి తీసుకున్న సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఒవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇటీవల అశ్విన్ కౌంటీ క్రికెట్లో 6 వికెట్లు తీశాడు. అంతే కాకుండా ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం కూడా భారత్‌కి కలిసొస్తుంది. అయితే కచ్చితంగా నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలనే కోహ్లీ అభిప్రాయం ప్రకారం చూస్తే.. ఇషాంత్ శర్మ బదులుగా శార్ధుల్ ఠాకూర్ జట్టులోకి రావొచ్చు. శార్దుల్ బంతితో పాటు బ్యాటుతోనూ సత్తా చాటగలడు. అయితే జడేజా ఫిట్ అన్న వార్తల నేపథ్యంలో అతడికి కూడా అవకాశం ఉంది.

రూట్ జోరుకి కళ్లెం వేయాల్సిందే:
ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో మూడు శతకాలు సహా ఐదు వందలకు పైగా పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి జోరుకి కళ్లెం వేయాలంటే ఆర్ అశ్విన్ లాంటి సీనియర్ స్పిన్నర్ల అవసరం ఎంతైనా ఉంది. టీ20 ప్లేయర్ డేవిడ్ మలన్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో అదరగొడుతున్న మార్క్ వుడ్, తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని ముప్పుతిప్పలు పెడుతున్న క్రిస్ వోక్స్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం ఇంగ్లండ్‌కు సానుకూలాంశం. నాలుగో టెస్టులో జోస్ బట్లర్ స్థానంలో జానీ బెయిర్‌స్టో వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. సామ్ బిల్లింగ్స్, ఒలీ పోప్ తుది జట్టులో ఆడనున్నారు. వరుసగా విఫలమవుతున్న ఆల్‌రౌండర్ సామ్ కరన్ స్థానంలో మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ బరిలోకి దిగుతాడు. మొత్తానికి ఇంగ్లండ్ పటిష్టంగానే ఉంది.

1971 తర్వాత విజయమే లేదు:
లార్డ్స్‌లో ఘన విజయం సాధించిన వెంటనే లీడ్స్‌లో ఘోర పరాజయం ఎదురుకావడం భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సిరీస్‌లో ఆధిక్యం సాధించాలంటే ఒవల్‌లో గురువారం నుంచి ప్రారంభం కాబోయే నాలుగో టెస్టులో కచ్చితంగా గెలవాల్సిందే. అయితే ఓవల్ మైదానంలో 1971 తర్వాత ఇంగ్లండ్‌పై భారత్ మళ్లీ విజయం సాధించలేదు. ఆ తర్వాత ఐదు టెస్టులు డ్రా కాగా.. మూడింటిలో భారత్ ఓటమిపాలైంది. అయితే టెస్టుల్లో హర్భజన్ సింగ్ (417) ఫీట్‌కు రవిచంద్రన్ అశ్విన్ (413) ఇంకా నాలుగు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచులో ఆ ఘనత యాష్ అందుకోనున్నాడు.

వర్షం ముప్పు:
నాలుగో టెస్ట్ మ్యాచ్ జరిగే కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలించే అవకాశముంది. మిగతా వేదికలతో పోలిస్తే పేస్‌కు కాకుండా స్పిన్‌కు సహకరించవచ్చు. మ్యాచ్ సాగేకొద్ది స్పిన్నర్లు పండగ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఇరు జట్లలోని స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. అయితే గురువారం ఉదయం వాతావరణం బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఓవల్ మైదానంలో మబ్బులు పట్టాయి. ఆకాశం మేఘావృతం అయి ఉంది. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్ సమయానికల్లా వర్షం పడే అవకాశం ఉంది.

తుది జట్ల అంచనా:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా/శార్దుల్ ఠాకూర్, ఆర్ అశ్విన్, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్: రోరీ బర్న్స్, హసీద్ హమీద్, డేవిడ్ మలన్, జో రూట్ (కెప్టెన్), ఓలి పోప్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలి రాబిన్సన్, మార్క్ వుడ్.


Click it and Unblock the Notifications












