ఫోటోలు: వాంఖడెలో అద్భుత ప్రదర్శన చేసిన టాప్ 5 ఆటగాళ్లు
హైదరాబాద్: ముంబై టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయం సాధించడంతో ప్రతీకారం తీర్చుకుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సిరిస్‌ను కైవసం చేసుకుని ఆతిథ్య జట్టుని ఖంగు తినిపించింది. అంతేకాదు 2012లో జరిగిన టెస్టు పరాభవానికి గాను దెబ్బకు దెబ్బ తీసింది.
ముంబైలోని వాంఖడెలో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది. ముంబై టెస్టు విజయంతో టీమిండియా వరుసగా ఐదు టెస్టు సిరీస్‌లను గెలిచింది.
అంతేకాదు 2014లో ఇంగ్లాండ్‌తో కోల్పోయిన ట్రోఫీని తిరిగి చేజిక్కించుకున్నట్లయింది. అంతక ముందు శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండిస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లపై టీమిండియా గెలుపొందింది. ముంబై టెస్టులో ఐదో రోజైన సోమవారం ఆట అరగంటలోనే ముగిసింది.
అప్పటికే ఓటమి అంచున ఉన్న ఇంగ్లాండ్ ఏ దశలోనూ పోరాట పటిమ కనబర్చలేకపోయింది. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న బెయిర్‌స్టో(51) కూడా జట్టును గట్టెక్కించడంలో విఫలమయ్యాడు. అశ్విన్ తన తొలి ఓవర్ నుంచే ప్రభావం చూపడం మొదలుపెట్టాడు. వైవిధ్యమైన బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు.
సహచరులకు భిన్నంగా సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న బెయిర్‌స్టోను తన మ్యాజిక్ స్పిన్‌తో అశ్విన్ బోల్తా కొట్టించాడు. తన రెండో ఓవర్ ఆఖరి బంతికి బెయిర్‌స్టో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీనిపై వెంటనే డీఆర్‌ఎస్‌కు వెళ్లిన ఈ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌కు అక్కడ కూడా చుక్కెదురైంది.
ఆ తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పతనం కావడానికి ఎక్కువసేపు పట్టలేదు. ఓవైపు జడేజా తన స్పిన్‌తో ఉక్కిరిబిక్కిరితో ఒత్తిడి పెంచుతుంటే మరోవైపు అశ్విన్ ఓవర్‌కో వికెట్ చొప్పున పడగొట్టాడు. బెయిర్‌స్టో తర్వాత క్రీజులోకొచ్చిన వోక్స్(0) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
రషీద్(2), అండర్సన్(2)కూడా అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు. జడేజా (2/63), జయంత్ (1/39) ఆకట్టుకున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానం మొత్తం కలియదిరిగిన కోహ్లీసేనకు స్టేడియంలోని ప్రేక్షకులు లేచి నిలబడి అభివాదం తెలిపారు.

విరాట్ కోహ్లీ
ముంబై టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు రికార్డులు సృష్టించాడు. నాలుగో టెస్టులో కోహ్లీ (235) డబుల్ సెంచరీ సాధించడంతో అత్యధిక వ్యక్తిగత పరగులు సాధించిన భారత టెస్టు కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉంది. 2013లో ఆస్ట్రేలియాపై ధోని సాధించిన 224 పరుగులే ఇప్పటివరకూ టెస్టుల్లో భారత కెప్టెన్‌గా అత్యధిక స్కోరు. ముంబై టెస్టులో కోహ్లీ ఈ రికార్డుని అధిగమించాడు. అంతేకాదు ఒక కేలండర్ ఇయర్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.
ఈ ఏడాది మొదట్లో వెస్టిండిస్‌తో కరేబియన్ దీవుల్లో జరిగిన టెస్టులో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటీవలే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ 211 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు. తాజాగా ముంబైలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఒక ఏడాదిలో మూడు సెంచరీలు సాధించిన తొలి కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. గతంలో ఒక కేలండర్ ఇయర్‌లో భారత తరపున వినోద్ మన్కడ్, వినోద్ కాంబ్లి, రాహుల్ ద్రవిడ్ రెండు డబుల్ సెంచరీలు సాధించారు.
ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 96వ పరుగు చేసే క్రమంలో కోహ్లీ ఈ సిరిస్‌లో 500 పరుగుల మార్కుని అందుకున్నాడు. దీంతో మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రికార్డుని సమం చేశాడు. ఒక సిరిస్‌లో 500కు పైగా పరుగులను గవాస్కర్ రెండు సార్లు సాధించాడు. 1978-79 సీజన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ ఐదు వందలకు పైగా పరుగులు చేశాడు. ఆ తర్వాత 1981-82 సీజన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ ఐదు వందల పరుగుల మార్కును రెండోసారి సాధించి చరిత్ర సృష్టించాడు.

మురళీ విజయ్
రెండు, మూడు టెస్టుల్లో విఫలం కావడంతో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అయితే ముంబై టెస్టులో ఆ ఒత్తిడిని జయించి తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులతో సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 631 పరుగుల నమోదు చేయడంలో కోహ్లీ, ఛటేశ్వర్ పుజారాలతో కలిసి చక్కని భాగస్వామ్యాలను నమోదు చేశాడు. అంతేకాదు మురళీ విజయ్‌కి ఇది 8వ టెస్టు సెంచరీ కావడం విశేషం.

జయంత్ యాదవ్
తన కెరీర్‌లో మూడో టెస్టు ఆడిన ఈ హర్యానా ఆల్ రౌండర్ సెంచరీతో అలరించాడు. ముంబై టెస్టులో 9వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జయంత్ యాదవ్ 104 పరుగులు సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో తొమ్మిది వికెట్ గా వచ్చి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 196 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లోనే అరంగేట్రం చేసిన జయంత్ అద్భుతమైన ఆల్ రౌండర్ పాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్ కోహ్లితో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని అందించాడు. చివరికి 104 పరుగులు చేసి రషీద్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. విరాట్‌తో కలిసి ఎనిమిదో వికెట్ కు 240 పరుగులు జోడించి మరో రికార్డు కూడా సృష్టించాడు. ఏ జట్టుపైనైనా టీమిండియా తరఫున ఎనిమిదో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.

రవిచంద్రన్ అశ్విన్
ముంబై టెస్టులో అశ్విన్ రికార్డుల మోత మోగించాడు. ఈ టెస్టులో అశ్విన్ 10 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆరు వికెట్లు తీశాడు. దాంతో 10 వికెట్లను అత్యధిక సార్లు తీసిన భారత రెండో బౌలర్‌గా అశ్విన్ గుర్తింపు పొందాడు. టెస్టు కెరీర్‌లో అశ్విన్ ఇలా 10 వికెట్లను తీయడం ఏడోసారి. 43 టెస్టుల్లో అశ్విన్ ఈ ఘనతను అందుకున్నాడు.
అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో ఎనిమిది సార్లు ఈ ఘనత సాధించాడు. అయితే భారత్ తరుపున అత్యధికంగా 10 వికెట్లను తీసుకున్న బౌలర్‌గా అశ్విన్ మొదటి స్ధానంలో నిలిచాడు. అనిల్ కుంబ్లే 8 సార్లు 10 వికెట్లను తన ఖాతాలో వేసుకుని మొట్టమొదటి స్ధానంలో నిలిచాడు. కుంబ్లే రికార్డుని అధిగమించడానికి అశ్విన్‌కు ఎంతో సమయం పట్టకపోవచ్చని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇటీవలే టెస్టుల్లో 200 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్‌గా కూడా అశ్విన్ నిలిచిన సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అశ్విన్ అధిగమించాడు.

రవీంద్ర జడేజా
ముంబై టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వ్యక్తిగత రికార్డుని అందుకున్నాడు. ముంబై టెస్టులో జడేజా 100వ వికెట్‌ను తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 6 వికెట్లు తీసుకోగా, జడేజా 4 వికెట్లు తీసుకుని మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో జడేజా రెండు వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications