

సౌతాంప్టన్: టెస్టు జట్టులో ప్రతి మ్యాచ్‌కు మార్పులతో బరిలోకి దిగే కోహ్లీ.. ఈ సారి ఎటువంటి మార్పులు లేకుండానే టీమిండియాను సిద్ధం చేస్తున్నాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో జరగబోయే నాలుగో టెస్టులో జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కోహ్లీ నాయకత్వంలో భారత్ 38 టెస్టులు ఆడింది. ఏ ఒక్కసారి ఆడిన జట్టుతో మళ్లీ బరిలోకి దిగలేదు. కనీసం ఒక్క మార్పు అయినా తప్పనిసరి.
అలాంటిది సౌతాంప్టన్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య గురువారం నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ నాటింగ్‌హామ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాలనుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'కోహ్లీ ఇది నిజమేనా... జట్టులో ఒక్క మార్పు కూడా చేయకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నావా; నమ్మలేకపోతున్నాం' అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
గాయం కారణంగా రవిచంద్రన్ అశ్విన్ నాలుగో టెస్టులో ఆడతాడో లేదో అని అనుమానించి జట్టులో మార్పులు తప్పవంటూ అభిప్రాయపడ్డారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అశ్విన్ పూర్తిగా కోలుకున్నాడని, నాలుగో టెస్టుకు అందుబాటులో ఉంటాడని కోహ్లీ స్పష్టం చేశాడు. దీంతో జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని ఖరారైంది. ఇప్పటికే జట్టులో పృథ్వీ షా.. హనుమ విహారీలు సభ్యులుగా ఉండగా వారికి ఆడే అవకాశం వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-2తో వెనుకంజలో ఉంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని కోహ్లీ సేన భావిస్తోంది. మరో పక్క ఇంగ్లాండ్ మాత్రం ఈ టెస్టులో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటి వరకు 38 టెస్టులకు నాయకత్వం వహించిన కోహ్లీ తన పేరిట 22 విజయాలు, 7 పరాజయాలు, 9 డ్రాలు నమోదు చేసుకున్నాడు.