
మ్యాచుకు ముందు వరణుడి ముప్పు:
నాలుగో టెస్ట్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతోంది. ఆటలో భాగంగా భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం మూడో రోజు ఆరంభం కానుంది. లండన్‌లోవాతావరణం ప్రస్తుతం మబ్బులు పట్టిఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆకాశం మేఘావృతం అయి ఉంటుందట. మ్యాచ్ సమయానికి ముందు చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ ఆగేంతగా వర్షం పడదని సమాచారం. ఇక మొదటి సెషన్ అనంతరం ఎండకాస్తుందని లండన్ వాతావరణ శాఖ పేర్కొంది. రెండు, మూడు సెషన్ల ఆటకు ఎలాంటి వర్షపు ముప్పులేదు. మొత్తానికి మూడో రోజు ఆట సజావుగానే సాగనుంది.

రాహుల్, రోహిత్ నిలబడితేనే:
మొదటి రోజు ఉదయం ఎండకాసినా.. మ్యాచ్ సమయానికల్లా ఆకాశమంతా పూర్తిగా మబ్బులు పట్టింది. కానీ మ్యాచుకు మాత్రం ఎలాంటి అంతరాయం జరగలేదు. పిచ్‌పై తేమ ఉండడంతో ఇరు జట్ల బౌలర్లు చెలరేగారు. రెండో రోజైన శుక్రవారం కూడా వరణుడు ఆటకు అంతరాయం కలిగించ లేదు. ఎండ కాస్తూనే.. అప్ప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అయింది. దీంతో పిచ్ పేస్ బౌలర్లకు సహకరించింది. మూడో రోజు ఆట ఆరంభానికి ముందు ఆకాశం మబ్బులు పట్టి ఉండనుంది. మొదటి సెషన్ ఆరంభానికి ముందు ఆకాశం మేఘావృతం అయి ఉండనుండడంతో పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. పిచ్‌పై ఉన్న తేమ ఉపయోగించుకుని ఇంగ్లండ్ పేసర్లు ఉదయం చెలరేగే అవకాశం ఉంది. ఇది భారత బ్యాట్స్‌మెన్‌కు కాస్త కష్టమనే చెప్పాలి. ఓపెనర్లు రాహుల్, రోహిత్ మొదటి సెషన్లో నిలబడితే.. మ్యాచుపై భారత్ పట్టుసాధించొచ్చు.

ఉమేశ్ దెబ్బ:
రెండోరోజు 53/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. తొలిరోజు కెప్టె జో రూట్‌ను అద్భుతమైన డెలివరీతో బౌల్డ్ చేసిన ఉమేశ్ యాదవ్.. శనివారం జోరు కొనసాగిస్తూ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఇద్దరినీ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చాడు. ఆట మొదలైన రెండో ఓవర్లోనే నైట్‌వాచ్‌మన్ క్రెయిగ్ ఒవర్టన్ (1)ను స్లిప్ క్యాచ్‌తో ఔట్ చేసిన ఉమేశ్.. కాసేపటి తర్వాత అప్పటికే క్రీజులో కుదురుకున్న డేవిడ్ మలన్ (31) వికెట్ పడగొట్టి ఇంగ్లీష్ జట్టును దెబ్బ తీశాడు. రూట్ సేన 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో భారత్‌కే ఆధిక్యం దక్కుతుందేమో అన్న ఆశలు రేగాయి. కనీసం ఆధిక్యం కోల్పోదనిపించింది. కానీ భారత్ ఆశలను ఓలీ పోప్ (81; 159 బంతుల్లో 6×4) చిదిమేశాడు.

ఆదుకున్న ఓలీ పోప్:
ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న ఓలీ పోప్.. ఇంగ్లీష్ జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. క్రీజులో పాతుకుపోయిన పోప్.. జానీ బెయిర్‌స్టో (37; 77 బంతుల్లో 7×4), మొయిన్ అలీ (35; 71 బంతుల్లో 7×4), క్రిస్ వోక్స్ (50; 60 బంతుల్లో 11×4)లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. బెయిర్‌స్టోతో అతడి భాగస్వామ్యమే (89 పరుగులు) మ్యాచ్‌పై భారత్ పట్టు కోల్పోయేలా చేసింది. వికెట్ కోసం భారత్ నిరీక్షణకు సిరాజ్ తెరదించాడు. బెయిర్‌స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక్కడి నుంచైనా వికెట్ల పతనం వేగమందుకుంటుందేమో అనుకుంటే.. పోప్‌కు మొయిన్ అలీ తోడయ్యాడు. మరో వికెట్ కోసం భారత్ ఇంకో 20 ఓవర్లకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. ఈలోపు స్కోరు 220 దాటిపోయింది.

వోక్స్ అర్ధ శతకం:
భారత బౌలర్లు అసహనానికి గురవుతున్న సమయంలో మొయిన్ అలీ.. రవీంద్ర జడేజా (2/36) బౌలింగ్‌లో ఓ పేలవమైన షాట్ ఆడి వెనుదిరిగాడు. స్కోరు 250కి చేరుకున్నాక పోప్.. శార్దూల్ ఠాకూర్ బంతిని వికెట్ల మీదికి ఆడుకుని వెనుదిరగడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. కానీ వోక్స్ టెయిలెండర్ల అండతో భారీ షాట్లు ఆడుతూ స్కోరును ముందుకు నడిపించాడు. ఆధిక్యాన్ని వందకు చేరువ చేశాడు. ఈ క్రమంలో అతడి అర్ధ శతకం కూడా పూర్తయింది. చివరికి బై తీయబోయి వోక్స్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

56 పరుగుల వెనుకంజలో భారత్:
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. రెండో రోజు ఆట చివరకు 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (20 బ్యాటింగ్), లోకేష్ రాహుల్ (22 బ్యాటింగ్) కాస్త తడబడ్డప్పటికీ.. వికెట్ అయితే ఇవ్వలేదు. రోహిత్ ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భారత్ ఇంకా 56 పరుగులు వెనుకబడి ఉంది. బ్యాట్స్‌మెన్ మూడో రోజంతా నిలిస్తే తప్ప మ్యాచ్‌పై ఆశలుండవు. అలా కాని పక్షంలో శనివారమే మ్యాచ్ ఫలితం తేలిపోవడమో.. లేదా ఫలితంపై ఓ అంచనా రానుంది.


Click it and Unblock the Notifications












