
ముగ్గురు బ్యాట్స్‌మెన్ అర్ధ శతకాలు
రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్‌ను నాలుగు ఓవర్లలోనే టీమిండియా ఆలౌట్ చేసింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ముగ్గురు బ్యాట్స్‌మెన్ అర్ధ శతకాలను అందించారు. సాహా స్థానంలో జట్టులోకొచ్చిన పార్థివ్.. విజయ్ జతగా ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఏమాత్రం తడబాటుకు లోనుకాకుండా విజయ్‌తో కలిసి పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో వీరిద్దరు ఒక్కోసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

మొహాలి టెస్టులో రాణించిన పార్ధీవ్ పటేల్
39 పరుగుల స్కోరువద్ద మురళీ విజయ్ (12) వికెట్‌ను జానీ బెయిర్‌స్టో క్యాచ్ పట్టగా బెన్ స్టోక్స్ పడగొట్టాడు. ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ దిశగా స్టోక్స్ సంధించిన బంతిని ఆడే క్రమంలో కీపర్ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి విజయ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత పుజారాతో కలిసి పార్థివ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ చక్కని షాట్లతో పార్థివ్ అలరించాడు. ఈ క్రమంలో 65 బంతులు ఎదుర్కొని, 42 పరుగులు సాధించిన పార్థీవ్ పటేల్‌ను రషీద్ ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ పంపాడు.

ఇంగ్లాండ్ డీఆర్ఎస్ విజయవంతం
రషీద్ అప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్ నిరాకరించడంతో ఇంగ్లండ్ డీఆర్‌ఎస్‌కు వెళ్లి విజయవంతమైంది. పార్థివ్ నిష్క్రమణతో క్రీజులోకొచ్చిన కోహ్లీ పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ సిరిస్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పుజారా మరోసారి అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమం లో వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 75 పరుగుల భాగస్వా మ్యం నెలకొల్పారు. అయితే టీ విరామం తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయింది. పుజారా 104 బంతుల్లో, ఎనిమిది ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి, అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు.

ఈ సిరిస్‌లో నిలకడగా ఆడుతున్న అశ్విన్
దీనితో 148 పరుగుల స్కోరువద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆజింక్య రహానే పరుగుల ఖాతా తెరవక ముందే రషీద్ అతనిని ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. మొహాలి టెస్టుతో అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్ నాలుగు పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. దీంతో కనీసం రెండు వందల స్కోరైనా దాటుతుందా అనిపించింది. అనంతరం రవిచంద్ర అశ్విన్‌తో కలిసి జట్టు స్కోరును 200 పరుగుల మైలురాయిని దాటించిన విరాట్ కోహ్లీ 62 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుటయ్యాడు.

అశ్విన్, జడేజాలు కీలక ఇన్నింగ్స్
127 బంతులు ఎదుర్కొన్న అతనిని జానీ బెయిర్‌స్టో క్యాచ్ అందుకోగా బెన్ స్టోక్స్ వెనక్కు పంపాడు. కోహ్లీ వికెట్ 204 పరుగుల వద్ద కూలగా, రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. అతను 82 బంతుల్లో 57, జడేజా 56 బంతుల్లో 31 పరుగులతో క్రీజ్‌లో ఉండగా, భారత్ 83.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 271 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బెన్ స్టోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. 204/6 స్కోరు ఉన్నదశలో ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ను నిలబెట్టారు.

ఈ సిరీస్‌లో అశ్విన్ మూడో అర్ధసెంచరీ
సిరీస్‌లో మూడో అర్ధసెంచరీ నమోదు చేసుకున్న అశ్విన్.. తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు వచ్చి రావడంతోనే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ జడేజా స్కోరుబోర్డును పరుగెత్తించాడు. మూడు ఫోర్లు, ఓ భారీ సిక్స్‌తో జడేజా అలరించాడు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 67 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే జోరు మూడో రోజు కొనసాగిస్తే ఇంగ్లండ్‌పై కీలక ఆధిక్యం సాధించవచ్చు.


Click it and Unblock the Notifications











