India vs England 3rd T20I preview: కీలక మార్పుతో బరిలోకి భారత్.. మొయిన్ అలీకి చాన్స్! తుది జట్లు ఇవే!

అహ్మదాబాద్: రెండో టీ20లో అద్భుత విజయంతో మంచి ఫుల్ జోష్‌లో ఉన్న భారత్ సిరీస్‌లో ముందుకు దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. మంగళవారం రాత్రి 7 గంటలకు మొతెరా స్టేడియంలో జరిగే మూడో టీ20లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించాలని కోహ్లీసేన లక్ష్యంగా పెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో అన్ని రంగాల్లో విఫలమై 8 వికెట్ల తేడాతో ఓడిన భారత్.. రెండో మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకుని ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. ఇక మూడో మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సంపాదించే వీలుంటుంది. దీంతో చివరి రెండు టీ20ల్లో ఏ ఒక్కటి నెగ్గినా సిరీస్ సొంతం అవుతుంది. లేని పక్షంలో వరుసగా చివరి రెండు టీ20ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోసారి టాప్-2 జట్ల మధ్య పొట్టి సమరం ఆసక్తికరంగా సాగనుంది.

రాహుల్ స్థానంలో రోహిత్:
మూడో టీ20కి తుది జట్టు ఎంపికలో ఓ మార్పు జరిగే అవకాశం ఉంది. తొలి రెండు టీ20లకు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చామని కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పిన నేపథ్యంలో.. మూడో మ్యాచ్‌కు అతను కచ్చితంగా జట్టులోకి వచ్చే అవకాశముంది. రెండు మ్యాచ్‌ల్లోనూ వరుసగా 1, 0 పరుగులు చేసి నిరాశపర్చిన కేఎల్ రాహుల్ స్థానంలో రోహిత్ ఆడే వీలుంది. మరోవైపు అరంగేట్ర మ్యాచ్‌లోనూ ధనాధన్ అర్ధ శతకంతో సత్తాచాటి జట్టు విజయానికి బాటలు వేసిన ఇషాన్ కిషాన్‌ను తప్పించే పరిస్థితి లేదు కాబట్టి రాహుల్ దూరమవ్వక తప్పదు. రోహిత్ రాకతో భారత బ్యాటింగ్ మరింత బలంగా మారనుంది.

సూర్యకు బ్యాటింగ్ వచ్చేనా?:
చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చి అజేయంగా నిలిచి రెండో టీ20లో జట్టును విజయతీరాలకు చేర్చడం శుభపరిణామం. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న రిషబ్ పంత్ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సిన బాధ్యత ఉంది. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాతో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పటిష్ఠంగా ఉంది. ఇప్పటికే అయ్యర్, పాండ్యా విలువైన ఇన్నింగ్స్ ఆడారు. మరోసారి చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. ఇక అరంగేట్ర మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాని సూర్యకు ఈ మ్యాచ్‌లోనైనా క్రీజులో అడుగుపెట్టే ఛాన్స్ దొరకుతుందేమో చూడాలి.

బౌలింగ్‌లో మార్పులు చేయకపోవచ్చు:
బౌలింగ్‌లో టీమిండియా దాదాపు మార్పులు చేయకపోవచ్చు. స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్ ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. శార్దుల్ ఠాకూర్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అవసరం అయితే బ్యాట్‌తో కూడా రాణించగలడు. ఇక హార్దిక్ పాండ్యా పూర్తి కోటా బౌలింగ్ చేయగలిగాడు. పునరాగమనంలో భువనేశ్వర్ కుమార్ కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు కాబట్టి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడం సులువు కాదు.

మొయిన్ అలీకి చాన్స్:
మంచి విజయం తర్వాత ఇంగ్లండ్ రెండో మ్యాచ్‌లో తేలిపోయింది. ముందుగా బ్యాటింగ్‌లో రాణించలేకపోయిన ఇంగ్లండ్.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ప్రత్యర్థిని నిలువరించలేక సునాయాసంగా తలవంచింది. దూకుడైన బ్యాటింగ్ లైనప్ కనిపిస్తున్నా.. కీలక సమయంలో జట్టు సమష్టిగా విఫలమైంది. రాయ్, బట్లర్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తే.. మలాన్, బెయిర్‌స్టో ముందుకు తీసుకెళ్లగలరు. కెప్టెన్ మోర్గాన్ మాత్రమే తడబాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఆడగలుగుతున్నాడు. స్టోక్స్ పేలవ ప్రదర్శన కూడా ఇంగ్లండ్‌కు ఇబ్బందిగా మారింది. అందరూ రాణిస్తే కోహ్లీసేనకు కష్టాలు తప్పవు. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని రెండో స్పిన్నర్‌గా అనుభవజ్ఞుడు మొయిన్ అలీకి అవకాశం దక్కుతుంది. టామ్ కరన్‌ను పక్కన పెట్టనున్న మేనేజ్‌మెంట్.. వుడ్ ఫిట్‌గా ఉంటే జోర్డాన్‌ను తప్పించాలని యోచిస్తోంది.

పిచ్, వాతావరణం:
నరేంద్ర మోడీ స్టేడియంలో ఎర్రమట్టితో కనిపిస్తున్న పిచ్.. స్పిన్‌కు ఎక్కువగా సహకరించే వీలుంది. ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఎక్కువగా మంచు ప్రభావం లేనప్పటికీ టాస్ నెగ్గిన జట్టు మరోసారి ఛేదనకే మొగ్గు చూపే వీలుంది. ఈ నేపథ్యంలో మరోసారి టాస్ కీలకం కానుంది. మ్యాచుకు ఎలాంటి వర్షం ముప్పులేదు.

తుది జట్లు (అంచనా):
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, కిషన్, పంత్, అయ్యర్, సూర్యకుమార్, హార్దిక్, సుందర్, శార్దుల్, భువనేశ్వర్, చహల్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, కరన్, అలీ, ఆర్చర్, రషీద్, వుడ్/జోర్డాన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications