
పూణే: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగులకు పాల్పడిన 35 మంది బుకీ ఏజెంట్లను పూణే పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మూడు మ్యాచుల సిరీసులో భాగంగా పూణే నగరంలోని ఎంసీఏ స్టేడియంలో శుక్రవారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగి రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా బెట్టింగులకు పాల్పడిన 35 మంది బుకీ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పింప్రీ చించ్ వాద్ పోలీసు కమిషనర్ కృష్ణ ప్రకాష్ ఓ ప్రకటనలో చెప్పారు. ఎంసీఏ స్టేడియంలోనే అందరిని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు.
బెట్టింగు ముఠా సభ్యులైన బుకీ ఏజెంట్లు భారత్-ఇంగ్లండ్ రెండో వన్డే మ్యాచ్ వివరాలను ఎంసీఏ స్టేడియం నుంచి కంట్రోల్ రూంకు అందిస్తున్నారని పూణే పోలీసులు తెలిపారు. ప్రతి డెలివరీ ఫలితం గురించి వారు కంట్రోల్ సెంటర్‌లో తమ సహచరులకు సమాచారం పంపించారట. వికెట్, ఓవర్, బౌండరీల వివరాలు అందించారట. మ్యాచ్ రిజల్ట్ చెపుతుండగా పోలీసులు 35 మందిని అరెస్టు చేశారు. బుకీల అరెస్టుతో క్రికెట్ బెట్టింగ్ బాగోతం బట్టబయలైంది. గత ఏడాది గురుగ్రామ్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగులకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశారు.
శుక్రవారం టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 43.3 ఓవర్లలలో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) తృటిలో శతకం కోల్పోయాడు. జేసన్ రాయ్ (52 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం చేశాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది.
రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ (114 బంతుల్లో 108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (79 బంతుల్లో 66; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా.. రిషభ్ పంత్ (40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 35; 1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఇంగ్లీష్ బౌలర్లలో రీస్ టాప్లీ, టామ్ కరన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఆదివారం మూడో వన్డే జరగనుంది.