
లండన్: నాలుగో రోజైన ఆదివారం రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలను పెవిలిన్ చేర్చాడు. మూడు ఓవర్ల వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీలు క్రీజులో ఉన్నారు. ఇటీవలి కాలంలో పుజారా వరుసగా విఫలమవుతుండడంతో.. ఇక భారత్ ఆశలన్ని కోహ్లీపైనే పెట్టుకుంది. ఎప్పటినుంచో కెప్టెన్ నుంచి సెంచరీ ఆశిస్తున్న అభిమానుల ఇప్పటికైనా నెరవేరుతుందో చూడాలి.
మూడో రోజు ఇంగ్లండ్ ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. మార్క్ వుడ్ వేసిన 9.2 ఓవర్‌కు కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. దాంతో భారత్ 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ 30 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేశాడు. ఆరంభంనుంచే రాహుల్ కాస్త తడబడినట్టు కనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీతో అదరగొట్టిన రాహుల్ ఆదిలోనే ఔట్ కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
కేఎల్ రాహుల్ అవుటైన కాసేపటికే మరో ఓపెనర్ రోహిత్ శర్మ అవుటయ్యాడు. రాహుల్‌ను వెనక్కి పంపిన మార్క్ వుడ్‌కే రోహిత్ కూడా దొరికిపోయాడు. 2 ఫోర్లు, సిక్సర్ బాది ఊపుమీద ఉన్నట్టు కనిపించిన రోహిత్.. 21 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. మార్క్ వుడ్ వేసిన 12వ ఓవర్‌లో మూడో బంతికి సిక్సర్ బాదిన రోహిత్.. తర్వాత ఆరో బంతికి మరో భారీ షాట్ ఆడి మోయిన్ అలీ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో చేతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నారు. భారత్ ఆధిక్యం 15కు చేరింది.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ అయింది. మొహ్మద్ షమీ వేసిన 127.5 ఓవర్‌కు జేమ్స్ అండర్సన్ (0) బౌల్డయ్యాడు. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (180; 321 బంతుల్లో 18x4) భారీ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. జానీ బెయిర్‌స్టో (57; 107 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీ చేయగా.. రోరీ బర్న్స్ 49 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో మొహ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ 3, మొహ్మద్ షమీ 2 వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. లోకేష్ రాహుల్ సెంచరీ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో రూట్ సేనకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. మరో రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. భారత్ 250కిపైగా టార్గెట్ విదిస్తే.. డ్రా చేసుకోవడానికైనా, విజయం సాదించడానికైనా అవకాశం ఉంటుంది.