
లండన్: భారత్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ లంచ్ విరామానికి 24.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జానీ బెయిర్ స్టో (4) పరుగులతో ఉండగా, జోస్ బట్లర్ పరుగులేమీ చేయకుండా ఉన్నాడు.
లంచ్ విరామానికి ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (19) పరుగుల వద్ద మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకముందు ఈ టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన ఓలీ పోప్(28) పరుగుల వద్ద ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. అంతకముందు కెప్టెన్ జో రూట్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
ఆటలో భాగంగా మూడో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆదిలోనే దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో వరుస ఓవర్లలో ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ అలిస్టర్ కుక్ (21) వరుస బౌండరీలతో కాసేపు స్కోరు బోర్డుని పరుగులెత్తించగా.. మరో ఓపెనర్ జెన్నింగ్స్ (11) అతనికి చక్కటి సహకారం అందించాడు.
ఇన్నింగ్స్ 7.3 వద్ద షమి వేసిన బంతికి ఓపెనర్ జెన్నింగ్స్(11) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టాడు. అంపైర్ ప్రకటించిన ఎల్బీడబ్ల్యూ ఔట్ నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేసిన జెన్నింగ్స్.. సమీక్షకి వెళ్లినా అతనికి నిరాశ తప్పలేదు. ఆ తర్వాత ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో మరో ఓపెనర్ అలిస్టర్ కుక్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆఫ్ స్టంప్‌కి సమీపంలో వెళ్తున్న బంతిని కట్ చేసేందుకు కుక్ ప్రయత్నించగా.. అతని బ్యాట్ అంచున తాకిన బంతి నేరుగా వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. దీంతో స్వల్ప వ్యవధిలో ఇంగ్లాండ్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. స్వల్ప వ్యవధిలో ఇంగ్లాండ్ ఓపెనర్లలిద్దరి వికెట్లు చేజార్చుకోవడంతో క్రీజులో ఉన్న రూట్, పోప్ వికెట్లను కాపాడుకుంటూ ఆచితూచి ఆడారు.
13.3వ ఓవర్ వద్ద పాండ్యా వేసిన బంతిని ఎదుర్కొన్న పోప్ సింగిల్స్ తీయడంతో ఇంగ్లాండ్ స్కోరు 50 పరుగుల మైలు రాయిని అందుకుంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌటైంది. కాగా, ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
భారత ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ చేసిన 29 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. కెప్టెన్ కోహ్లీ 23, రహానే 18, హార్దిక్ పాండ్యా 11, షమీ 10 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను దారుణంగా దెబ్బతీశాడు. వర్షం కారణంగా గురువారం తొలి రోజు ఆట పూర్తిగా రద్దయిన సంగతి తెలిసిందే.