
పూణే: పూణే: మూడు వన్డే మ్యాచుల సిరీసులో భాగంగా పూణే వేదికగా జరుగుతున్న రెండవ వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో శతకం చేశాడు. తొలి వన్డేలో సెంచరీకి కొద్ది దూరంలో (94) ఆగిపోయిన బెయిర్‌స్టో.. రెండో వన్డేలో ఆ ఫీట్‌ను అందుకున్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన 31వ ఓవర్ మొదటి బంతికి సిక్సర్ బాదిన బెయిర్‌స్టో.. వన్డేల్లో 11వ సెంచరీ నమోదు చేశాడు. 95 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో సెంచరీ చేశాడు. మరోవైపు బెన్ స్టోక్స్ 40 బంతుల్లో అర్ధ శతకం అందుకున్నాడు. ఠాకూర్ వేసిన 32వ ఓవర్ మూడో బంతికి సింగల్ తీసి ఫిఫ్టీ మార్క్ చేరాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 100 పరుగులకు పైగా జోడించడంతో ఇంగ్లండ్ లక్ష్యం దిశగా దూసుకెళుతోంది.
హాఫ్ సెంచరీ అనంతరం బెన్ స్టోక్స్ వరుస సిక్సులతో రెచ్చిపోతున్నాడు. కుల్దీప్ వేసిన 33వ ఓవర్లో స్టోక్స్ వరుసగా మూడు సిక్సర్లు బాదేశాడు. కుల్దీప్ ఈ వన్డేలో ఇప్పటికే 8 సిక్సర్లు ఇచ్చాడు. వన్డేలో ఒక భారత బౌలర్ ఎక్కువ సిక్సర్లు ఇవ్వడం 2011 జనవరి తర్వాత ఇదే తొలిసారి. 2013లో బెంగళూరులో ఆస్ట్రేలియా మ్యాచులో ఆర్ వినయ్ కుమార్ 7 సిక్సర్లు ఇచ్చాడు. కుల్దీప్ 9 ఓవర్లు వేసి 77 పరుగులు ఇచ్చాడు. కృనాల్ వేసిన 34 ఓవర్లో 3 సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. దానికి తోడు రెండు పరుగులు వైడ్ల ద్వారా వచ్చాయి. దీంతో భారత్ మ్యాచులో ఓటమి అంచున నిలిచింది. ఇంగ్లండ్ 86 బంతుల్లో 51 పరుగులు మాత్రమే చేయాలి.
అంతకుముందు జోరు మీదున్న జేసన్ రాయ్ (52 బంతుల్లో 55: 7 ఫోర్లు, 1 సిక్స్) రనౌట్‌గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ 110 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ వేసిన బంతిని బెయిర్ స్టో మిడ్ వికెట్ దిశగా ఆడి పరుగు కోసం వెళ్లాడు. అంతలోనే అద్భుత రీతిలో బంతిని అందుకున్న రోహిత్ వికెట్ కీపర్ రిషబ్‌కు బంతిని త్రో వేశాడు. వెంటనే పంత్ వికెట్లకు గిరాటేయడంతో నాన్ స్ట్రయికర్ ఎండ్ నుంచి వస్తోన్న రాయ్ అవుటయ్యాడు.