For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: విజయానికి చేరువలో కోహ్లీసేన.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్ 52/1! మరో 157 పరుగులే!!

India need 157 runs to win on Final Day at Nottingham

నాటింగ్‌హామ్‌: ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది. ఆటలో చివరిరోజు అయిన ఆదివారం మరో 157 పరుగులు సాధిస్తే.. ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన శుభారంభం చేసినట్టే. శనివారం రెండో ఇన్నింగ్స్‌లో రూట్ సేన 303 పరుగులకు ఆలౌటవ్వగా.. నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 52 రన్స్ చేసింది. ఓపెనర్ రోహిత్‌ శర్మ(12), నయా వాల్ చేతేశ్వర్‌ పుజారా (12) పరుగులతో క్రీజులో ఉన్నారు. మరో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ (26; 38 బంతుల్లో 6x4) ఔట్ అయ్యాడు. భారత్ జోరు చూస్తుంటే.. లంచ్ సమయానికల్లా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

శుభారంభం దక్కలేదు:
నాలుగో రోజు శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఆట ప్రారంభమైన కాసేపటికే మొహ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌లో ఓపెనర్ రోరీ బర్న్స్‌ (18) రిషబ్ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జాక్‌ క్రాలీ (6)ని జస్ప్రీత్ బుమ్రా వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్‌ వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ డామ్‌ సిబ్లీ (28; 133 బంతుల్లో 2x4) నిలకడగా ఆడాడు. మరోవైపు ఇంగ్లీష్ కెప్టెన్‌ జో రూట్‌ (109; 172 బంతుల్లో 14x4) గేరు మార్చాడు. వరుసగా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.

ఆదుకున్న సిబ్లీ, రూట్:
జో రూట్‌, డామ్‌ సిబ్లీలు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సింగిల్స్ తీస్తూ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. ముఖ్యంగా రూట్ వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే చెత్త బంతులను బౌండరీలుగా మార్చాడు. అయితే షమీ వేసిన 38వ ఓవర్లో బౌండరీ బాదిన రూట్‌.. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ అనంతరం సిబ్లీ.. బుమ్రా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. తర్వాత జానీ బెయిర్‌స్టో (30; 50 బంతుల్లో 4x4)తో కలిసి రూట్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. రూట్ నెమ్మదిగా ఆడగా.. బెయిర్‌స్టో కాస్త వేగంగా ఆడాడు. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ ఇంగ్లీష్ స్కోర్ బోర్డును ముందుకు కదిపాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో సిరాజ్‌ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు దొరికిపోయాడు.

రూట్‌ సెంచరీ:
అనంతరం జో రూట్‌కు డానియెల్‌ లారెన్స్‌ (25; 32 బంతుల్లో 4x4) జతకలిశాడు. లారెన్స్‌ వచ్చిరావడంతోనే భారత బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు. బౌండరీలు బాదుతూ ఇంగ్లండ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ధాటిగా ఆడుతున్న లారెన్స్‌ను శార్ధూల్‌ ఠాకూర్‌ వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ ఐదో వికెట్‌ కోల్పోయింది. అనంతరం జోడీ కట్టిన రూట్‌, బట్లర్‌ మరో వికెట్‌ పడకుండా రెండో సెషన్‌ను పూర్తి చేశారు. మూడో సెషన్‌ ఆరంభంలో బట్లర్ పెవిలియన్ చేరాడు. ఈ దశలో సామ్ కరన్‌ (32; 45 బంతుల్లో 4x4) అండతో రూట్ సెంచరీ పూర్తిచేసుకుని ఔట్ అయ్యాడు. కరన్‌, రాబిన్‌సన్‌ ధాటిగా అదే క్రమంలో ఔట్ అయ్యారు. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు తీయగా.. సిరాజ్‌, శార్ధూల్‌ చెరో రెండు వికెట్‌లు తీశారు.

మరో 157 పరుగులే:
ఇంగ్లండ్ ఆలౌట్ అనంతరం టీమిండియా 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్ శర్మ ఆచితూచి ఆడారు. రోహిత్ క్రీజులో నిలదొక్కుకోవటానికి ప్రయత్నించగా.. రాహుల్ వేగంగా ఆడాడు. ధాటిగా ఆడే క్రమంలో స్టువర్ట్ బ్రాడ్‌ బౌలింగ్‌లో రాహుల్ కీపర్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్‌ 34 పరుగుల వద్ద తొలి వికెట్‌ నష్టపోయింది. అనంతరం జోడీ కట్టిన రోహిత్‌, పుజారా మరో వికెట్‌ పడకుండా నాలుగో రోజు ఆటను ముగించారు. ఆదివారం చివరిరోజు మరో 157 పరుగులు సాధిస్తే ఐదు టెస్టుల సిరీస్‌లో శుభారంభం చేసినట్టే.

అంతా బాగానే ఉన్నా:
అంతా బాగానే ఉన్నా.. టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఫామ్ కలవరపెడుతోంది. తన సుదీర్ఘ కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా అతడు ఇబ్బంది పడుతున్నాడు. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు సాధించే కోహ్లీ.. గత 20 నెలలుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. టీ20, వన్డేల్లో మోస్తరుగా రాణిస్తున్నా.. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఇటీవలి కాలంలో హాఫ్ సెంచరీ చేయడమే అతడికి గగనం అయిపొయింది. కోహ్లీ బ్యాటింగ్​ సగటు కూడా రోజురోజుకు పడిపోతుండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టుల్లోనైనా గాడిలో పడతాడనుకుంటే.. అది జరగలేదు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ గోల్డెన్ డకౌటయ్యాడు. జేమ్స్ అండర్సన్‌ బౌలింగ్లో మరోసారి ఔట్ అయి విమర్శల పాలయ్యాడు. ఒకవేళ ఆదివారం రోహిత్ శర్మ లేదా చేతేశ్వర్ పుజారా త్వరగా ఔట్ అయితే.. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతాడో లేదో చూడాలి.

Story first published: Sunday, August 8, 2021, 0:22 [IST]
Other articles published on Aug 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+