
చెన్నై: నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని చెపాక్ మైదానంలో మరికొద్ది సేపట్లో తొలి టెస్టు ఆరంభంకానుంది. మూడు రోజులు ప్రాక్టీస్ చేసిన రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపాడు. ఇక పితృత్వపు సెలవులు తీసుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు, ఓ లెఫ్టార్మ్ స్పిన్నర్‌తో బరిలోకి దిగుతోంది. భారత జట్టులోకి షాబాద్ నదీమ్ వచ్చాడు. లోకల్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో చోటు దక్కడం విశేషం. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆసీస్ సిరీస్‌లో ఒక్క టెస్ట్ ఆడని కుల్దీప్‌కు స్వదేశంలో కూడా నిరాశే ఎదురయింది. ఈ సిరీస్ టీమ్‌ఇండియాతో పాటు ఇంగ్లండ్ జట్టుకూ ఎంతో కీలకం కానుంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత సాధించగా, మిగిలిన స్థానానికి భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి.
భారత్ గడ్డపై 1933 నుంచి ఇంగ్లండ్ టీమ్ టెస్టు మ్యాచ్‌లు ఆడుతోంది. ఇప్పటి వరకూ రెండు జట్ల మధ్య భారత్ గడ్డపై 60 టెస్టులు జరిగాయి. ఇందులో 19 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించగా.. 13 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది. ఇక మిగిలిన 28 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత్ గడ్డపై చివరిగా ఆడిన 12 టెస్టు సిరీస్‌ల్లోనూ టీమిండియాకు ఓటమే లేదు. చివరి 35 టెస్టుల్లోనూ భారత్ జట్టు కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఓడింది.
ఇక ఇంగ్లండ్ టీమ్ చివరిగా భారత్ గడ్డపై టీమిండియాని టెస్టు మ్యాచ్‌లో 2012-13లో ఓడించింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఆ జట్టు చేతిలో టీమిండియా ఇక్కడ పరాజయాన్ని చవిచూడలేదు. చెనై వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటి వరకు 9 టెస్టులు జరిగాయి. అందులో భారత్ 5 గెలువగా.. ఇంగ్లండ్ మూడింట నెగ్గింది. ఓ మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది.
తుది జట్లు:
భారత్: రోహిత్, గిల్, పుజారా, కోహ్లీ (కెప్టెన్), రహానే, పంత్, సుందర్, అశ్విన్, నదీమ్, బుమ్రా, ఇషాంత్.
ఇంగ్లండ్: బర్న్స్, సిబ్లీ, లారెన్స్, రూట్ (కెప్టెన్), స్టోక్స్, ఓలీ పోప్, బట్లర్, బెస్, ఆర్చర్, జాక్ లీచ్, అండర్సన్