IND vs ENG: తొలి టీ20 మ్యాచ్ రద్దు?
IND vs ENG: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాజయాన్ని మర్చిపోయి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు బుధవారం నుంచి ఇంగ్లాండ్ జట్టుతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో సరికొత్తగా బరిలోకి దిగనుంది. చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా జరగనున్న ఈ మొదటి పోరులో విజయం సాధించి ఘనంగా ప్రారంభించాలని టీమిండియా భావిస్తోంది. ఐర్లాండ్ పర్యటనలో పరాజయం తర్వాత జట్టు ప్రదర్శన, ఎంపికపై వరుసగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై తొలి విజయాన్ని నమోదు చేయాలనే ఒత్తిడి భారీగా ఉంది. ఇంగ్లాండ్ జట్టుపై బలమైన ఆరంభం లభిస్తే జట్టుపై ఒత్తిడి తగ్గడమే కాకుండా ఆటగాళ్లలో కోల్పోయిన ఆత్మవిశ్వాసం కూడా తిరిగి వస్తుంది. కానీ ఈ మ్యాచ్‌కు వాతావరణం రూపంలో ఓ పెద్ద ఆటంకం ఎదురయ్యేలా కనిపిస్తోంది.
ఐర్లాండ్ పర్యటన తరహాలోనే ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌కు కూడా వాతావరణం విలన్‌గా మారే అవకాశం ఉంది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లో మ్యాట్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడటానికి 35 శాతం వరకు ఆస్కారం ఉంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల వరకు అక్కడ విడతల వారీగా వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుండటంతో వర్షం పడే సమయానికే మ్యాచ్ సమయం కూడా ఉండటం వల్ల ఆటకు అంతరాయం కలగడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు ఈ కీలక పోరు కోసం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తమ తుది జట్టును ముందే ప్రకటించింది. ఇంగ్లీష్ జట్టు తమ ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడానికి ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్‌లను తుది జట్టులోకి తీసుకుంది. కాగా స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించారు. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టుకు హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హోమ్ గ్రౌండ్ అనుకూలతలను పూర్తిగా ఉపయోగించుకుని భారత జట్టుపై ఆధిపత్యం చెలాయించాలని హ్యారీ బ్రూక్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.
వాతావరణంతో పాటు ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ అభిమానుల కళ్లన్నీ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీకి ఎట్టకేలకు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్ పర్యటనలో సిరీస్ మొత్తం బెంచ్‌కే పరిమితమైన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ గత సీజన్లో విధ్వంసం సృష్టిస్తూ 230కి పైగా స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఆ సీజన్లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను కూడా కైవసం చేసుకున్నాడు. మరి ఈ రోజు ఇంగ్లాండ్‌తో జరిగే పోరులో అతనికి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications