బెంగుళూరు: ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్‌లో భాగంగా ఈనెల 19న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మిస్ అయ్యాడు. ఈ లోటు అభిమానులతో పాటు షారుఖ్‌ను సైతం కలిచివేసింది.
ఈ నేపథ్యంలో టోర్నీలో భారత్‌కు ఎంతో కీలకమైన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌ను వీక్షించేందుకు షారుఖ్ సిద్ధమయ్యాడు. బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది.
టోర్నీలో సెమిస్‌లో ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌లో మెరుగైన రన్ రేట్‌తో భారత్ గెలవాల్సి ఉంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌తో కలిసి షారుఖ్ టీవీ కామెంటేటరీలో పాల్గొననున్నాడు.

భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనున్న తీరుని కామెంటేటర్‌గా 20 నిమిషాల పాటు షారుఖ్ వివరించన్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో బిజీగా ఉండటంతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌కు షారుఖ్ హాజరుకాలేక పోయారు.
వాస్తవానికి అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆయన ఈ మ్యాచ్‌లో జాతీయగీతాన్ని ఆలపించాలి. ఈ మ్యాచ్‌కు రాకపోవడం తనను కూడా బాధించిందని, అల్లా దయతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచి వరల్డ్ కప్ అందుకుంటే చూడాలని ఉందని షారుఖ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.