అభిమానుల మనసు దోచుకున్న కోహ్లీ: నా కోసం కాదు.. షమీ కోసం అరవండి (వీడియో)!!

ఇండోర్: హోల్కర్ స్టేడియంలో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత పేసర్లు విజృంభించడంతో.. బంగ్లా చివురుటాకులా వణికింది. మహమ్మద్ షమీ (3/27), ఇషాంత్ శర్మ (2/20), ఉమేశ్ యాదవ్ (2/47) నిప్పులు చెరగడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ (43; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మోమినుల్ హక్ (37; 6 ఫోర్లు) మినహా మిగిలినవారు కనీస ప్రతిఘటన లేకుండానే పెవిలియన్ చేరారు.

కోహ్లీకి మద్దతు:
మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో భారత్‌ను ప్రోత్సహించేందుకు అభిమానులు విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచారు. కోహ్లీ.. కోహ్లీ అంటూ అభిమానులు కేరింతలు కొట్టారు. అయితే కోహ్లీ కల్పించుకొని తన కోసం కాకుండా బౌలింగ్ చేస్తున్న షమీని ఉత్సాహ పరచాలని చేతల ద్వారా సైగలు చేసాడు. అప్పుడు షమీ 55వ ఓవర్ వేస్తున్నాడు.

అభిమానుల నినాదాలు:
విరాట్ కోహ్లీ అలా సైగలు చేయగానే షమీ.. షమీ అంటూ అభిమానులు నినాదాలు చేసారు. అభిమానుల అరుపులు బౌలర్‌లో స్ఫూర్తి నింపిందో ఏమోగానీ ఆ ఓవర్ ఐదో బంతికి ముష్ఫికర్‌ను ఔట్ చేశాడు. చివరి బంతికి మెహిది హసన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన షమీకి త్రుటిలో హ్యాట్రిక్ చేజారింది. తన తర్వాత ఓవర్ మొదటి బంతిని తైజుల్ ఇస్లామ్ విజయవంతంగా డిఫెండ్ చేశాడు.
కోహ్లీపై ప్రశంసలు:
ఈ ఘటనతో కోహ్లీ మరోసారి అభిమానుల మనసు దోచుకున్నాడు. సహచరులను తానెంత ప్రేమిస్తున్నాడో చాటిచెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో కూడా కోహ్లీ బౌలర్లకు అండగా నిలవాలని సైగలు చేసిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications