
కోల్‌కతా: భారత క్రికెట్ చరిత్రలో మరో అరుదైన ఘట్టానికి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా నవంబర్ 22-26 మధ్య ఇక్కడ జరుగనున్న రెండో టెస్టు మ్యాచ్‌ను టీమిండియా గులాబీ బంతితో ఆడనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగేండ్ల క్రితమే తొలి డేనైట్ టెస్టు జరిగినా.. అగ్ర జట్టు అయిన భారత్ ఇన్నాళ్లకు ఆడబోతుండడం విశేషం. అయితే తొలి డేనైట్ టెస్టు మ్యాచ్ కనీస టికెట్ ధరను రూ.50గా నిర్ణయించాం అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) సెక్రటరీ అవిషేక్ దాల్మియా తెలిపారు.
తాజాగా అవిషేక్ దాల్మియా మాట్లాడుతూ... 'సాధారణ డేనైట్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 నుంచి మొదలవుతాయి. కానీ వచ్చేది శీతాకాలం కాబట్టి మంచు ప్రభావం నేపథ్యంలో మ్యాచ్‌ను ఒక గంట ముందే ప్రారంభింస్తాం. మ్యాచ్ రాత్రి 8:30 కల్లా పూర్తయ్యేలా బీసీసీఐని అనుమతి కోరుతున్నాం. 68 వేల మంది సామర్థ్యమున్న ఈ స్టేడియాన్ని ప్రేక్షకులతో నింపేందుకు కనీస టికెట్ ధరను రూ.50గా నిర్ణయించాం. బీసీసీఐ నుంచి మ్యాచ్ నిర్వహణ సమయంపై స్పష్టత రాగానే టికెట్ల ప్రక్రియ ప్రారంభింస్తాం' అని తెలిపారు.
'స్కూల్ విద్యార్థులు మ్యాచ్ వీక్షించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. రోజువారీగా టికెట్ల ధరలను రూ.50, 100, 150గా నిర్ణయిస్తాం. దీంతో అత్యధిక మంది ప్రేక్షకులను స్టేడియానికి వచ్చే అవకాశం ఉంది. సాధారణ టెస్టు మ్యాచ్‌ల్లాగే తొలి సెషన్‌లో 20 నిమిషాల టీ బ్రేక్, 40 నిమిషాల భోజన విరామం ఉంటుంది. ఒకటిన్నర సెషన్ ఫ్లడ్ లైట్ల వెలుగులో మ్యాచ్ జరుగుతుంది' అని దాల్మియా చెప్పారు.
'తొలి డేనైట్ టెస్టు మ్యాచ్ ఇక్కడ జరగడం చాలా సంతోషం. క్రికెట్ అభిమానులకు ఇది గొప్ప వార్త. ఈడెన్ గార్డెన్స్‌కు ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మరో పేజీ చేరబోతోంది. డే-నైట్ టెస్టు క్రికెట్ అభివృద్ధికి దోహదపడుతుంది. పింక్ బంతితో మ్యాచ్‌ను మొదటిగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించింది. గతంలో స్థానిక మ్యాచ్‌ను నిర్వహించాం. ఇప్పుడు మరో కొత్త అడుగు వేయనున్నాం' అని అన్నారు.
'సాధించాలనుకునేది మేం సాధించి తీరుతాం. ఈ టెస్టును విజయవంతం చేయడానికి క్యాబ్ ఏ చిన్న అవకాశాన్ని వదలదు. ఈ టెస్ట్ చిరస్మరణీయంగా మారడానికి ఇప్పటి నుండే అంతర్గతంగా ప్రణాళికలను ప్రారంభిస్తాం. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో చర్చించాలి. డే/నైట్ టెస్టుకు ప్రముఖలను ఆహ్వానించాలని భావిస్తున్నాం. ఆ రోజు సందడి వాతావరణం నెలకొంటుంది' అని దాల్మియా తెలిపారు.