
డేనైట్ టెస్టు పక్కా
సోమవారం సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్‌తో మాట్లాడాను. డేనైట్ టెస్టుకు వారు సుముఖంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆటగాళ్లతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. కోల్‌కతాలో డేనైట్ టెస్టు తప్పకుండా జరుగుతుంది. త్వరలో బీసీబీ అధికారికంగా ప్రకటిస్తుంది. అతి త్వరలో మాకు పూర్తి సమాచారం అందుతుంది' అని తెలిపారు.

డేనైట్ టెస్టుకు మేరీకోమ్, పీవీ సింధు:
'డేనైట్ టెస్టుకు భారత ఒలింపిక్స్ విజేతలు బాక్సర్ మేరీకోమ్, షట్లర్ పీవీ సింధుని ఆహ్వానించాలని భావిస్తున్నాం. వారితో పాటు పాఠశాల విద్యార్థులకు ఉచిత పాసులను ఇవ్వాలని అనుకుంటున్నాం' అని దాదా పేర్కొన్నారు. ఇప్పటికే టెస్టుకు బంగ్లా, భారత ప్రధానులను దాదా ఆహ్వానించిన విషయం తెలిసిందే. బంగ్లా ప్రధాని కోల్‌కతా టెస్టుకు వస్తానని కూడా హామీ ఇచ్చారు.

సమయం చాలా తక్కువ ఉంది:
డేనైట్ టెస్టుకు సన్నద్ధమవ్వడానికి తక్కువ సమయం ఉందని బీసీబీ ఉన్నతాధికారి అక్రమ్ ఖాన్ అన్నారు. 'టెస్టు క్రికెట్‌లో డేనైట్ సరికొత్త అడుగు. కానీ.. దానికి సన్నద్ధమవ్వడానికి సమయం చాలా తక్కువ ఉంది. డేనైట్ టెస్టుపై బంగ్లా ఆటగాళ్లతో అధ్యక్షుడు చర్చిస్తారు. వీలయినంత త్వరలో మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం' అని వెల్లడించారు.

ఈడెన్ గార్డెన్స్‌లో డేనైట్ టెస్టు:
భారత్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. టీ20ల సిరీస్‌లో భాగంగా నవంబర్ 3న ఢిల్లీ వేదికగా బంగ్లాతో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అనంతరం రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా 14 నుండి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు 22 నుంచి రెండో టెస్టు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆడుతాయి. ఒకవేళ బీసీబీ డేనైట్ టెస్టుకు అంగీకరిస్తే.. గంగూలీ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది.


Click it and Unblock the Notifications
