
ఈ వివాదం త్వరలో భారత పర్యటనకు వచ్చే బంగ్లా జట్టుపై పడనుందా అని అడిగిన ప్రశ్నకు సెలక్టర్ హబిబుల్ బషర్ స్పందించాడు. 'కాంట్రాక్ట్ విషయంలో షకీబ్-బీసీబీల మధ్య సమస్య తలెత్తింది. ఇది క్రికెట్‌కు సంబంధించినది కాదు. ఈ వివాదం జట్టుపై ఏమాత్రం ప్రభావితం చేయలేదు. సమ్మె ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ విషయాన్ని బోర్డు రెండు రోజుల్లో పరిష్కరించింది. సమ్మె సమయంలో ప్రాక్టీస్ సెషన్‌లు కూడా జరగలేదు. బీసీబీ వివాదాన్ని సున్నితంగా హ్యాండిల్ చేసింది' అని బషర్ అన్నారు.
'కొన్నిసార్లు ఇటువంటి వ్యక్తిగత సమస్యలు వస్తాయి. అది సహజమే. ఇవేమీ జట్టును ప్రభావితం చేయవని నేను నమ్ముతున్నా. తమీమ్ ఇక్బాల్ వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగాడు. ఇది మాకు పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే అతను మా ఉత్తమ ఆటగాడు. ఫాస్ట్ బౌలింగ్ విషయంలో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కారించుకోవాలి. టెస్ట్ క్రికెట్లో బ్యాట్స్‌మన్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. పటిష్ట టీమిండియాతో సిరీస్ కాబట్టి.. 60-70 పరుగులు చేస్తే సరిపోదు, వాటిని సెంచరీలుగా మలచాలి' అని బషర్ పేర్కొన్నారు.
'ఈ సిరీస్ బంగ్లా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోల్‌కతా టెస్ట్ మ్యాచ్ చూసేందుకు బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వస్తారని అనుకుంటున్నా. ముఖ్యంగా జెస్సోర్, ఖుల్నా ప్రాంతాలు కోల్‌కతాకు రోడ్డు మార్గంలో చాలా దగ్గరగా ఉంటాయి. అలాగే బంగ్లా, కోల్‌కతాల మధ్య భావోద్వేగాలు సహజంగానే కలగలిసి ఉంటాయి. కోల్‌కతాలో నివసించే చాలా మంది మూలాలు బంగ్లాలోనే ఉన్నాయి. బంగ్లాలోనూ అనేక మంది కోల్‌కతాను తమ రెండో నివాసంగా భావిస్తారు. నా స్నేహితులు అనేక మంది కోల్‌కతా టెస్టుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. 6 వేల మంది వచ్చినా నేను ఆశ్చర్యపోను' అని బషర్ చెప్పుకొచ్చారు.