
షమీ పరుగు చిరుత వేటను తలపిస్తోంది
షమీ అద్భుత ప్రదర్శనపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి. గావస్కర్ కూడా షమీని ఆకాశానికెత్తాడు. తాజాగా గావస్కర్ మాట్లాడుతూ... 'షమీ బంతి విసిరేందుకు పరుగెడుతుంటే స్పైడర్ కెమెరాలోంచి ఆ షాట్ తీస్తే చూడ్డానికి ఎంతో బాగుతుంటుంది. వేట కోసం చిరుతపులి పరుగెడుతున్నట్టు అనిపిస్తుంది. షమీ సీమ్, మణికట్టు పొజిషన్ చాలా బాగుంది. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసేందుకు చేతి వేళ్లను వినియోగిస్తున్న విధానం అద్భుతం. ఈ నైపుణ్యం కోసం అతడెంతో సాధన చేశాడు' అని గావస్కర్ అన్నారు.

షమీ అత్యుత్తమ బౌలర్
ప్రస్తుత ఫామ్ ప్రకారం మహ్మద్ షమీ అత్యుత్తమ బౌలరని దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు. ట్విటర్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్టెయిన్ ఇలా సమాధానం ఇచ్చారు. 29 ఏళ్ల షమీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 68 వికెట్లు (అన్ని ఫార్మాట్లలో) తీసాడు. ఆసీస్ పేసర్ పాట్ కమ్మిన్స్ మాత్రమే ఈ సంవత్సరం ఎక్కువ వికెట్లు (83) తీసాడు. ద్వితీయ స్థానంలో షమీ ఉన్నాడు.

ప్రతి బంతికి వికెట్ తీసేలా ఉన్నాడు
భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా షమీపై ప్రశంసలు కురిపించాడు. 'షమీ బౌలింగ్ చేసే ప్రతి బంతిలో ఏదో ఉంది. అతను ప్రతి బంతికి వికెట్ తీసేలా కనబడుతున్నాడు. భారత పరిస్థితులలో చాలా మంది ఫాస్ట్ బౌలర్లకు ఆ నైపుణ్యం ఉండదు. కానీ.. షమీ మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. బంగ్లాదేశ్ అంత ప్రమాదకరమేమి కాకున్నా.. దక్షిణాఫ్రికాపై అతని ప్రదర్శన ఏంటో చూసాం. వైజాగ్‌లో ఫ్లాట్‌గా ఉన్న పరిస్థితులలో బాగా బౌలింగ్ చేసాడు. భారత ఫాస్ట్ బౌలర్లకు తగినంత క్రెడిట్ ఇవ్వం, ఎప్పుడూ విదేశీ ఫాస్ట్ బౌలర్ల గురించే మాట్లాడుకుంటాం. ఇప్పుడు పరిస్థితులు మారాయి' అని గంభీర్ పేర్కొన్నాడు.

తొలి డే/నైట్ టెస్టు
ఈ గెలుపుతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో మరో 60 పాయింట్లు ఖాతాలో వేసుకున్న టీంఇండియా.. ఓవరాల్‌గా మూడు వందల పాయింట్లతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. రెండు టెస్టుల సిరీస్‌లో టీంఇండియా 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కోల్‌కతా వేదికగా ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఆ టెస్టు మ్యాచ్ రెండు జట్ల టెస్టు చరిత్రలో తొలి డే/నైట్ టెస్టు కావడం విశేషం.


Click it and Unblock the Notifications












