బెంగళూరు: ఇటీవల కాలంలో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లు కూడా ఉద్వేగ భరితంగా సాగుతున్నాయి. బంగ్లాదేశ్ అభిమానుల అత్యుత్సాహమే ఇందుకు కారణమవుతోంది.
ఇటీవల ముగిసిన ఆసియా కప్ టోర్నీ సందర్భంగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెగిన తలను బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ పట్టుకున్నట్లు మార్ఫింగ్ ఫొటోతో ఓ బంగ్లా అభిమాని అత్యుత్సాహం చూపాడు. ఈ పరిణామంతో భారత అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
బంగ్లాపై సోషల్ మీడియా వేదిక భారత నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఆ తర్వాత ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో ధోనీ టీమిండియాను గెలిపించిన విషయం తెలిసిందే. దీంతో తస్కిన్ తెగిన తలను ధోనీ పట్టుకున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫొటోలను పోస్టు చేశారు భారత నెటిజన్లు.

గతంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీ సందర్భంగా కూడా ధోనీ సేనను అరగుండుతో ఉన్న మార్ఫింగ్ ఫొటోలను బంగ్లా అభిమానులు పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పాకిస్థాన్, ఇండియా మ్యాచ్‌ల ముందు వచ్చే మౌకా మౌకా ప్రకటనకు స్ఫూఫ్‌ను తయారు చేశారు. బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తలపడనున్న నేపథ్యంలో దీన్ని రూపొందించారు భారత అభిమానులు.
గత శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో ఇండియా ఘన విజయం సాధించి వరుస విజయాల పరంపరను కొనసాగించిన విషయం తెలిసిందే. బుధవారం బంగ్లాదేశ్ జట్టుతో భారత తలపడనుంది.
ఈ ప్రకటనలో భారత అభిమాని ఏర్పాటు చేసిన ఓ ఫొటో స్టూడియోకి మొదట ఓ పాకిస్థాన్ అభిమాని వస్తాడు. ప్రపంచ కప్ టోర్నీల్లో టీమిండియాపై తమ జట్టు గెలవడం లేదనే బాధతో టీ20 ప్రపంచ కప్ టోర్నీతో తన ఫొటోను మార్ఫింగ్ చేయాలని చెప్తాడు. బాగానే వస్తుంది కదా? అని చివరకు అడుగుతాడు. తగిన సమాధానం విన్న తర్వాత వెళ్లిపోతాడు.
ఆ తర్వాత బంగ్లాదేశ్ అభిమాని వస్తాడు. 'నాకు ప్రపంచ కప్ కావాలి' అంటాడు. 'ఆందోళన వద్దు, ట్రోఫీతో నీ ఫొటో తీస్తా'అని చెబుతాడు భారత అభిమాని(ఫొటో స్టూడియో వ్యక్తి). దీంతో నవ్విన బంగ్లా అభిమాని.. తనకు అసలైన ప్రపంచ కప్ కావాలని అంటాడు.
ఈ క్రమంలో భారత అభిమాని.. బంగ్లా అభిమాని ఓ స్కేలుతో కొలతను తీసుకుంటాడు. ఆ తర్వాత రెండు మూడు కత్తులు తీసి బంగ్లా అభిమాని మెడపై కత్తి పెట్టి తీస్తాడు. దీంతో భయాందోళనకు గురైన బంగ్లా అభిమాని.. ఏం చేస్తున్నావు? అని ప్రశ్నిస్తాడు. 'సార్ నీకు ప్రపంచ కప్ కావాలంటే నీ తలను తెంచి ధోనీ తలను పెట్టాల్సి ఉంటుంది' అని సమాధానమిస్తాడు భారత అభిమాని. దీంతో వెంటనే అక్కడ్నుంచి పరారవుతాడు బంగ్లా అభిమాని.