
హైదరాబాద్: రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినల్ హక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కష్టతరంగా ఉంటుందనే ఉద్దేశంతో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నట్లు బంగ్లా కెప్టెన్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతోంది.నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కష్టతరంగా ఉంటుందనే ఉద్దేశంతో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నట్లు బంగ్లా కెప్టెన్ తెలిపాడు. ఇక, టాస్ గెలిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా తొలుత బౌలింగ్ ఎంచుకునేవాడినని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. పిచ్ తొలి రోజు సీమర్లకు అనుకూలించే అవకాశం ఉందని, ఆ తర్వాత పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని కోహ్లీ తెలిపాడు.
రాంచీ టెస్టులో ఆడిన తుది జట్టు నుంచి ఒకే ఒక్క మార్పుతో టీమిండియా బరిలోకి దిగుతోంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ స్థానంలో ఇషాంత్ శర్మకు తుది జట్టులో చోటు కల్పించారు. బంగ్లాతో మూడు టీ20ల సిరిస్ నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ టెస్టు సిరిస్ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు జరిగితే.. అందులో ఏడింట భారత్‌నే విజయం సాధించగా... మరో రెండు టెస్టులు డ్రా అయ్యాయి.
సొంత గడ్డపై టీమిండియా తిరుగులేని ఆటతో దూసుకుపోతోంది. 2013 నుంచి ఇప్పటి వరకు 32 టెస్టులు ఆడితే టీమిండియా ఏకంగా 26 గెలిచి, 1 మ్యాచ్‌లో మాత్రమే ఓడింది. మిగిలిన ఐదు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. స్వదేశంలో వరుస విజయాలతో 11 సిరీస్‌లను చేజిక్కించుకున్న టీమిండియా ఇప్పుడు 12వ సిరిస్‌పై కన్నేసింది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 240 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా మరో 120 పాయింట్లు ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతుంటే.. బంగ్లా మాత్రం భారత్ జోరుకు ఎలా అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తోంది.
తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న హోల్కర్ స్టేడియం టీమిండియాకు అచ్చొచ్చిన స్టేడియమనే చెప్పాలి. ఈ స్టేడియంలో ఆడిన ఏడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. భారత్ ఇక్కడ ఆడిన ఐదు వన్డేలు, 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్, 2017లో శ్రీలంకతో జరిగిన ట 20 మ్యాచ్‌లో విజయం సాధించింది.
2016లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 321 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో టెస్టు కెప్టెన్ అజ్యింకె రహానే టెస్టు క్రికెట్‌లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరుని నమోదు చేశాడు. స్ఫిన్నర్ అశ్విన్ కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది కూడా ఇక్కడే. కివీస్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 140 పరుగులిచ్చి 13 వికెట్లు తీశాడు.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, అజ్యింకె రహానే, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ.
బంగ్లాదేశ్: ఇమ్రుల్ కైస్, షాద్మన్ ఇస్లాం, మహమ్మద్ మిథున్, మొనిముల్ హక్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, లిటన్ దాస్(కీపర్), మెహెది హసన్, తైజుల్ ఇస్లామ్, అబు జయెద్, ఇబాదత్ హొసేన్.