
హైదరాబాద్: టీమిండియా ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలు గైర్హాజరీతో ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో ఖలీల్ అహ్మద్ ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో ఇప్పటికే తొలి టీ20లో బంగ్లాదేశ్ నెగ్గగా... రెండో టీ20లో రోహిత్ సేన విజయం సాధించింది.
అయితే, ఈ సిరిస్‌లో ఖలీల్ అహ్మద్ వికెట్లు తీయడం మాట అటుంచి ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇప్పటికే ముగిసిన రెండు టీ20ల్లో కేవలం రెండు వికెట్లు తీసిన ఖలీల్ 81 పరుగులు సమర్పించుకోవడం విశేషం. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో 37 పరుగులిచ్చిన అహ్మద్.. రెండో టీ20లో 44 పరుగులిచ్చాడు.
ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రెండు టీ20ల్లో వరుసగా ఏడు ఫోర్లు ఇవ్వడం. తొలి టీ20లో నాలుగు బౌండరీలు ఇచ్చిన అహ్మద్.. రెండో టీ20లో వరుసగా మూడు ఫోర్లు ఇచ్చాడు. బంగ్లా సిరిస్‌లో వరుసగా ఏడు ఫోర్లు ఇవ్వడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
"తొలి టీ20లో పేలవ ప్రదర్శన చేసిన ఖలీల్‌ను రెండో టీ20లో కూడా కొనసాగించే ధైర్యం రోహిత్ శర్మ తప్పితే ఏ ఒక్కరూ చేయరేమో?" అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా... మరొక నెటిజన్ "ఖలీల్ అహ్మద్ భారతీయులు బుమ్రా విగ్రహానికి రోజుకు మూడు సార్లు పూజలు చేయాలని గుర్తు చేస్తున్నాడు" అని ట్వీట్ చేశాడు.
రాజ్‌కోట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ(85; 43 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో బంగ్లాదేశ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి ఛేదించింది.
ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది. సిరిస్ విజేత ఎవరో తెలిపే ఆఖరి టీ20 నాగ్ పూర్ వేదికగా ఆదివారం జరగనుంది. ఆఖరి టీ20లో గనుక బంగ్లాదేశ్ విజయం సాధిస్తే చరిత్ర సృష్టిస్తుంది. ఎందుకంటే టీ20 క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ ఇప్పటివరకు భారత్‌పై టీ20 సిరిస్ నెగ్గలేదు.