
టాంటన్: ప‌్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా ఇంగ్లండ్ టాంటన్‌లోని కూపర్స్ అసోసియేట్స్ కంట్రీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు ఆడిన తీరు పట్ల క్రికెట్ ప్రపంచం మంత్రముగ్ధమైంది. బంగ్లా క్రికెట్ జట్టును ప్రశంసల్లో ముంచెత్తుతోంది. వెస్టిండీస్ నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అసాధారణ విషయమంటూ మెచ్చుకుంటోంది. అదే సమయంలో- బంగ్లా పరాక్రమాన్ని పాకిస్తాన్ జట్టుతో పోల్చి చూస్తున్నారు నెటిజన్లు, ట్విట్టరెటీలు. 322 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన బంగ్లా పులులు ఎక్కడ? భారత్ విధించిన 336 రన్ల టార్గెట్‌ను అందుకోలేక చతికిలపడిన గ్రీన్ ఆర్మీ పాకిస్తాన్ ఎక్కడ? ఈ రెండింటి మధ్య ఎంత తేడా?..ఎంతో తేడా? అంటూ పోలికలను మొదలు పెట్టారు.
భారీ స్కోరు చేసే అవకాశం ఉన్నా..
నిజానికి వెస్టిండీస్ ఇన్నింగ్ అత్యంత పేలవంగా ఆరంభమైంది. తొలి 10 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 32 పరుగులు మాత్రమే. పైగా విధ్వంసకారుడు క్రిస్ గేల్ వికెట్‌ను కూడా కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్ల ఎక్కడా భయపెట్టనప్పటికీ.. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేయడంతో ప్రారంభ ఓవర్లలో విండీస్ బ్యాట్స్‌మెన్స్‌కు భారీ స్కోర్లు చేసే అవకాశం రాలేదు. ఆ తరువాతే కుదురుకున్నారు. మిడిల్ ఓవర్లలో చెలరేగిపోయి ఆడారు గానీ.. మ్యాచ్ ఫలితాలను శాసించే శ్లాగ్ ఓవర్లలో చేతులు ఎత్తేశారు. చివరి అయిదు ఓవర్లలో విండీస్ బ్యాట్స్‌మెన్లు 33 పరుగులు మాత్రమే రాబట్టుకోగలిగారు. జేసన్ హోల్డర్ 15 బంతుల్లో 33 విలువైన పరుగులను స్కోరుబోర్డుపై జత చేయకుంటే విండీస్ 300 మార్క్ దగ్గరే ఆగిపోయుండేది.
పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ మెరుగైన ప్రత్యర్థి
ఇక ముందు టీమిండియాకు పాకిస్తాన్ కంటే కూడా బంగ్లాదేశ్ జట్టే మెరుగైన ప్రత్యర్థి అని కితాబిస్తున్నారు నెటిజన్లు. భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్ కంటే బంగ్లాదేశ్ మ్యాచ్ ఇకపై అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. ఇదివరకు బంగ్లాదేశ్ ప్రపంచకప్‌లో ఓ సారి టీమిండియాను సైతం ఓడించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. వెస్టిండీస్‌పై సాధించిన ఘన విజయం అనంతరం బంగ్లాదేశ్ టీమ్ సూపర్ సిక్స్‌కు వెళ్లడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. 322 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకోవడంలో బంగ్లాదేశ్ ఏ మాత్రం వెనుకంజ వేయలేదని, దూకుడుగా ఆడి, ప్రత్యర్థిని మట్టి కరిపించిందని ప్రశంసిస్తున్నారు.