
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టులో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ మెహిదీ హసన్ అరుదైన ఘనత సాధించాడు. భారత్‌లో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టులో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ వచ్చిన తొలి ఆటగాడిగా మెహిదీ హసన్ నిలిచాడు.
మొదటి సెషన్ ఆఖరి ఓవర్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్ మూడో బంతి లిటన్ తలను బలంగా తాకింది. దీంతో అతడు మైదానంలోనే కొంత కలవరపాటుకు గురై హెల్మెట్‌ను తీసి చూసుకున్నాడు. అదే సమయంలో మైదానంలోకి పరుగెత్తుకు వస్తోన్న ఫిజియోకు ఫర్వాలేదని చెప్పిన లిట్టన్ దాస్ తిరిగి తన ఆటను కొనసాగించాడు.
ఆ తర్వాతి బంతికి ఏమైందో తెలియదు గానీ లెగ్ అంపైర్ వద్దకు వెళ్లి ఇబ్బందిగా ఉందని చెప్పాడు. దీంతో వెంటనే ఫిజియో వచ్చి అతడి పరిస్థితిని సమీక్షించి అతడిని రిటైర్డ్ హర్ట్‌గా తీసుకెళ్లాడు. దీంతో లంచ్ విరామం అనంతరం కాంకషన్ సబ్‌స్టిట్యూట్ కింద మెహిదీ హసన్ వచ్చాడు. ఈ మ్యాచ్‌లో మెహదీ హసన్ 8 పరుగులే చేసి ఔటయ్యాడు.
మెహదీ ఆఫ్ స్పిన్నర్ కావడంతో ఈ టెస్టులో బౌలింగ్ చేయలేడు. దీనికి తోడు అతడు వికెట్ కీపర్‌కు కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 106 పరుగులకే ఆలౌటైంది. భారత్ పేసర్లు చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ వంద పరుగుల మార్కును అతి కష్టం మీద చేరింది.
టీమిండియా బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, షమీలు బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. పదునైన బంతులతో వణికించారు. భారత పేసర్ల దెబ్బకు ఇద్దరు బంగ్లా బ్యాట్స్‌మన్‌కు గాయాలు కూడా అయ్యాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఓపెనర్ ఇస్లామ్ చేసిన 29 పరుగులే అత్యధికం కావడం గమనార్హం.
బంగ్లా జట్టులో నలుగురు ఆటగాళ్లు డకౌట్ కాగా, ఇద్దరు ఒక్కో పరుగు చేశారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 5 వికెట్లతో చెలరేగగా... ఉమేశ్ యాదవ్ 3, మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ రెండో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ కూడా ఉపయోగించుకోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన బౌన్సర్లతో బంగ్లా బ్యాట్స్ మెన్‌ను బెంబేలెత్తించాడు.
తొలుత షమీ బౌలింగ్‌లో లిట్టన్ దాస్ గాయపడి రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరగగా... తాజాగా షమీ బౌన్సర్ మరో బంగ్లా బ్యాట్స్‌మన్ నయీమ్ హసన్ హెల్మెట్‌ను బలంగా తాకింది. సహాయం కోసం పిలుపునివ్వడంతో అదే సమయంలో అక్కడే ఉన్న భారత ఫిజియో నితిన్ పటేల్ మైదానంలోకి పరిగెత్తకుంటా వచ్చాడు.
కొంత సేపటి తర్వాత అంతా సర్దుకోవడంతో తిరిగి బ్యాటింగ్ ప్రారంభించాడు. అయితే, 19 పరుగుల వద్ద ఔటైన నయీమ్ హసన్ తిరిగి మైదానంలోకి రాలేదు. దీంతో బంగ్లాదేశ్ ఫీల్డింగ్‌లో రెండో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ని ఉపయోగించుకుంది. నయీమ్ హసన్ స్థానంలో తైజుల్ ఇస్లాంను తీసుకుంది.