
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పగ్గాలు చేపట్టిన తర్వాతే
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పగ్గాలు చేపట్టగానే డే నైట్ టెస్టులపై ప్రధానంగా చర్చ సాగింది. ఎందుకంటే నాలుగేళ్ల క్రితమే ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి డే నైట్ జరిగింది. అయితే, టీమిండియా మాత్రం ఫ్లడ్‌లైట్ల వెలుతురు కింద ఆడేందుకు ససేమిరా అంది. నిజానికి ఈ ఏడాది ఆరంభంలో క్రికెట్ ఆస్ట్రేలియా బీసీసీఐని డే నైట్ టెస్టు మ్యాచ్ ఆడాల్సిందిగా కోరింది. అందుకు బీసీసీఐ అంగీకరించలేదు. అయితే, అక్టోబర్‌లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోహ్లీసేన సైతం డే నైట్ టెస్టు ఆడేందుకు ముందుకొచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడి మాటను కోహ్లీ గౌరవాన్నిస్తూ డే నైట్ టెస్టు ఆడేందుకు అంగీకరించాడు. దీంతో ఎవరూ ఊహించని విధంగా అతి తక్కువ సమయంలోనే టీమిండియా పింక్ బాల్ టెస్టుకు సిద్ధమవుతోంది.

పింక్ బాల్ కొత్త ఎరుపు
భారత్‌లో తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌కి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఆతిథ్యమిస్తోండటంతో నగరం మొత్తం గులాబీమయం అయింది. భవిష్యత్తులో టీమిండియా మరిన్ని పింక్ బాల్ మ్యాచ్‌లను నిర్వహించడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటి డే నైట్ టెస్టు మ్యాచ్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 27, 2015 న అడిలైడ్ ఓవల్‌లో జరిగింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టెస్టు క్రికెట్‌ను బ్రతికించుకునేందుకే
1800ల్లో మొదటిసారి అంతర్జాతీయ క్రికెట్‌లోకి టెస్ట్ క్రికెట్ ప్రవేశంతో క్రీడా సంస్కృతిలో తనదైన ముద్ర వేసింది. అధికారికంగా గుర్తించబడిన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య 15-19 మార్చి, 1877న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 45 పరుగుల తేడాతో గెలిచింది.

ఈడెన్ గార్డెన్స్
భారత్‌లో జరిగే తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోన్న ఈడెన్ గార్డెన్స్‌కు ఎంతో చరిత్ర ఉంది. 1987లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిచ్చింది. అలెన్ బోర్డర్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ బయట జరిగిన తొలి వరల్డ్‌కప్ ఫైనల్ ఇదే. అంతకముందు లార్డ్స్ వరుసగా 1975, 1979, 1983 వరల్డ్‌కప్ పైనల్స్‌కు ఆతిథ్మమిచ్చింది. మొదటి ఆసియా టెస్టు ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరిగింది. ఈ మ్యాచ్‌లో కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు నమోదయ్యాయి. 1999లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు విజేతగా నిలిచింది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లకు పాకిస్థాన్ మాజీ పేసర్ వేసిన బంతులు క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తే.

అపరిమిత కంటెంట్‌తో ముందుకొచ్చిన స్టార్ స్పోర్ట్స్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌ని క్రికెట్ అభిమానులకు మరింతగా చేరువ చేసేందుకు ప్రసారుదారు స్టార్ స్పోర్ట్స్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక వారం రోజులు ముందు నుంచే ఈడెన్ గార్డెన్స్‌లో పింక్ బాల్ పేరిట వేడుకలను ప్రారంభించింది. పింక్ బాల్ టెస్ట్ కోసం ప్రత్యేకంగా పింకు-టింకు అనే మస్కట్‌ను రూపొందించింది. భారత్‌లో జరిగే తొలి డే నైట్ టెస్టు ఓ మైలురాయిని సృష్టించేలా స్టార్ స్పోర్ట్స్ సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications
