India vs Bangladesh: ఈడెన్ గార్డెన్స్‌లో డే-నైట్ టెస్టుకు అమిత్ షా

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న తొలి డే/నైట్ టెస్టుకు హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. నవంబర్ 22 నుంచి 26 వరకు ఈడెన్ గార్డెన్స్‌లో తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. భారత్‌లో తొలిసారి డే/నైట్ టెస్ట్ ఆడనుండంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈడెన్‌లో జరిగే చారిత్రక ఘట్టాన్ని మరింత అపురూపంగా మలచడానికి క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) కృషి చేస్తోంది. ఈ చారిత్రక టెస్ట్ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరిద్దరూ గంట మోగించి డే/నైట్ టెస్టుని ప్రారంభించనున్నారు.

ఈడెన్‌లోని ప్రెసిడెంట్స్ బాక్స్ నుంచి
ఈ మ్యాచ్‌కి ముందు బంగ్లా ప్రతినిధుల బృందం మంగళవారం స్టేడియంలో పర్యటించి ప్రధాని భద్రతపై దృష్టి సారించారు. ఈడెన్‌లోని ప్రెసిడెంట్స్ బాక్స్ నుంచి హసీనా మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఇక మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లను ప్రధాని సత్కరించనున్నారు.

మోడీకి క్యాబ్ ఆహ్వానం:
డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌కు రావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి క్యాబ్ ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ప్రధాని వస్తారని కచ్చితమైన సమాచారం లేకున్నా.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వస్తున్నారు కాబట్టి ఆమెను కలిసేందుకు మోడీ కూడా రానున్నారు. ఇక విరామ సమయంలో దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్‌లతో చాట్ షోల నిర్వహణకు క్యాబ్ ప్లాన్ చేస్తోంది.

భారత్‌పై ఒక్క విజయం లేదు:
2000లో టెస్టు హోదా పొంది భారత్‌తోనే ఢాకాలో తొలి టెస్టు ఆడింది బంగ్లాదేశ్. అయితే ఇప్పటివరకు భారత్‌పై బంగ్లా మాత్రం విజయం సాధించలేదు. గత 19 ఏళ్లలో ఇరు జట్ల మధ్య 9 టెస్టులు జరిగాయి. 7 టెస్టుల్లో భారత్ నెగ్గగా.. రెండు టెస్టులు డ్రా అయ్యాయి. 2017 ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా టీమిండియాతో బంగ్లాదేశ్ చివరిసారిగా టెస్టు ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సాధించింది.

19 ఏళ్లలో మొత్తం 115 టెస్టులు:
మొత్తంగా బంగ్లాదేశ్ గత 19 ఏళ్లలో మొత్తం 115 టెస్టులు ఆడింది. ఇందులో 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఏకంగా 86 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక 16 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మష్రఫె ముర్తజా, షకీబ్, తమీమ్ లేకపోవడంతో ఒత్తిడిలో ఉన్న బంగ్లా.. ఏమేరకు రాణిస్తుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications