
కలలో కూడా ఊహించలేదు:
దీపక్ చాహర్ 3.2-0-7-6 బౌలింగ్ గణాంకాలతో హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు తీసి బంగ్లాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. చహర్‌కే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', 'సిరీస్' అవార్డులు దక్కాయి. మ్యాచ్ అనంతరం చాహర్ మాట్లాడుతూ... 'నేను ఇలాంటి ప్రదర్శనను గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కలలో కూడా ఊహించలేదు' అని అన్నాడు.

నా కష్టానికి ప్రతిఫలం దక్కింది:
'చిన్నప్పటి నుంచి కష్టపడి ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. నా ప్రయత్నాలు ఫలించాయి. నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. కీలక ఓవర్లలో నాతో బౌలింగ్ చేయించాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావించాడు. జట్టు యాజమాన్యం కూడా అదే అనుకుంది. నేనెప్పుడూ తర్వాత వేసే బంతిపైనే దృష్టి పెడుతా. నా స్పెల్ పూర్తయ్యేవరకు అలాగే ఆలోచిస్తా' అని చాహర్ తెలిపాడు.

దీపక్ హ్యాట్రిక్:
దీపక్ చాహర్ 3.2 ఓవర్లలో 6 వికెట్లు తీసాడు. తొలి ఓవర్లో 2 వికెట్లు తీసి కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చిన దీపక్.. తర్వాత ఓవర్లో వికెట్ తీయడంతో పాటు 4 పరుగులు ఇచ్చాడు. 18వ ఓవర్‌లో 2 పరుగులు ఇచ్చి.. చివరి బంతికి షఫీయుల్ వికెట్‌ను తీసాడు. ఇక 20వ ఓవర్ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్‌లను అవుట్ చేసి 'హ్యాట్రిక్' నమోదు చేశాడు.

టీ20ల్లో తొలి 'హ్యాట్రిక్':
భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 'హ్యాట్రిక్' తీసిన తొలి బౌలర్‌గా చహర్ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే మొత్తంగా ఈ ఘనత సాధించిన 11వ బౌలర్ దీపక్. మలింగ (శ్రీలంక) రెండుసార్లు 'హ్యాట్రిక్' తీయగా.. బ్రెట్ లీ (ఆస్ట్రేలియా), ఓరమ్, సౌతీ (న్యూజిలాండ్), తిసారా పెరీరా (శ్రీలంక), అష్రఫ్ (పాకిస్తాన్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), హస్నయిన్ (పాకిస్తాన్), ఖవర్ అలీ (ఒమన్), వనువా (పపువా న్యూగినియా) తలొసారి హ్యాట్రిక్ తీశారు.


Click it and Unblock the Notifications












