
నాగ్‌పూర్: విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మరికొద్ది సేపట్లో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన బంగ్లా కెప్టెన్ మహ్ముదుల్లా బౌలింగ్ ఎంచుకున్నాడు. మూడో టీ20 కోసం ఇరు జట్లు ఒక్కో మార్పు చేశాయి. కృనాల్ పాండ్యా స్థానంలో మనీష్ పాండే భారత్ తరపున బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు గాయం కారణంగా మొసాద్దీక్ తప్పుకోవడంతో మొహమ్మద్ మిథున్ బంగ్లా జట్టులోకి వచ్చాడు.
ఢిల్లీ మ్యాచ్‌లో ఓటమి ఎదురు కావడంతో టీమిండియా వ్యూహం మార్చాల్సి వచ్చింది.రాజ్‌కోట్ సమరంలో కసితీరా ప్రత్యర్థిపై చెలరేగిన రోహిత్ సేన ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరో అవకాశం ఇవ్వకుండా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు తొలి టీ20 స్ఫూర్తితో ఇంకో విజయం సాధిస్తే.. బంగ్లా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
నాగ్‌పూర్ పిచ్ సాధారణ బ్యాటింగ్ వికెట్. పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించనుంది. దేశంలోని పెద్ద గ్రౌండ్‌లలో ఒకటి. భారీ స్కోర్లకు అవకాశం తక్కువ. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకే అనుకూలం. ఇక్కడ జరిగిన గత 11 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే 8 సార్లు గెలిచింది. వర్షం పడే అవకాశాలు లేవు.
జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్/శార్దూల్ ఠాకూర్, చాహల్.
బంగ్లాదేశ్: లిటన్ దాస్, మహమ్మద్ నయీమ్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్ముదుల్లా (కెప్టెన్), అఫిఫ్ హుసేన్, మొహమ్మద్ మిథున్, అమినుల్ ఇస్లాం, షఫియుల్, అల్‌అమీన్ హుసేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్.