హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు మురళీ విజయ్, పుజారాలు అరుదైన రికార్డు నెలకొల్పారు. స్వదేశంలో ఓ సీజన్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా ఈ ఇద్దరూ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
ఈ ఇద్దరి జోడీ వల్ల సుమారు 68 ఏళ్ల టెస్టు క్రికెట్ రికార్డు బద్దలైంది. 1948-49 సీజన్లో భారత ఆటగాళ్లు విజయ్ హజారే- రుసి మోడీ నాలుగు సెంచరీ అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలి రోజు విజయ్-పుజారాలు సెంచరీ భాగస్వామ్యాన్ని(178 పరుగులు) అందించారు.

2016-2017 సీజన్లో ఇది వీరికి ఐదో సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం. దీంతో 1948-49 సీజన్లో విజయ్ హజారే-రుసి మోడీ సాధించిన నాలుగు సెంచరీ భాగస్వామ్యాల రికార్డును విజయ్-పుజారా అధిగమించారు. ఇదే క్రమంలో
పుజారా మరో అరుదైన ఘనత సాధించాడు. 1964-65లో చందు బోర్డే సాధించిన అత్యధిక ఫస్ట్ క్లాస్ పరుగులు (1604) రికార్డును పుజారా (1605 పరుగులు) అధిగమించాడు.
ఇదిలా ఉంటే ఈ టెస్టులో మురళీ విజయ్ 108 పరుగులు చేయగా, పుజారా 83 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లను కోల్పోయి 356 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి క్రీజులో కోహ్లీ 111, రహానే 45 పరుగులతో ఉన్నారు.