
దరాబాద్: ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 493/6 పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే, మూడో రోజైన శనివారం టీమిండియా అదే పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
నిజానికి శనివారం ఉదయం మరికొన్ని పరుగులు చేసి బంగ్లాని బ్యాటింగ్‌కి ఆహ్వానిస్తుందని అంతా భావించారు. అయితే, అందుకు భిన్నంగా బ్యాటింగ్‌కు రాకుండానే టీమిండియా తొలిఇన్నింగ్స్‌ను 493/6 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు చెలరేగుతున్నారు.
మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగ్లాదేశ్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఆరో ఓవర్‌లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఇమ్రుల్ కెయెస్(6) బౌల్డయ్యాడు. ఆ తర్వాత ఇషాంత్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ షాద్‌మాన్ ఇస్లామ్(6)ని బౌల్డ్ కావడంతో బంగ్లాదేశ్ 18 పరుగులకి రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇండోర్ వేదికగా గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. భారత్ రెండో రోజు 493/6 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగుల ఆధిక్యం లభించింది. మయాంక్ అగర్వాల్ (243), రహానే (86), రవీంద్ర జడేజా (60 నాటౌట్) రాణించిన సంగతి తెలిసిందే.