
సిడ్నీ: వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియాపై భారత్ బెబ్బులిలా చెలరేగుతోంది. మూడో వన్డే గెలిచి క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకొని.. తొలి టీ20లో విజయ ఢంకా మోగించింది. ఇక ఆదివారం సిడ్నీ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లోనూ గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే శుక్రవారం జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహాల్.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డుపై కన్నేశాడు.
ఆదివారం మధ్యాహ్నం జరగనున్న రెండో టీ20లో యుజ్వేంద్ర చహల్ మరో రెండు వికెట్లు పడగొడితే.. జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమిస్తాడు. ఇప్పటి వరకు 43 అంతర్జాతీయ టీ20లు ఆడిన చహల్ 58 వికెట్లు పడగొట్టాడు. 49 టీ20లు ఆడిన బుమ్రా 59 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో టీ20 మ్యాచ్‌లో చహల్ రెండు వికెట్లు పడగొడితే బుమ్రా రికార్డును అధిగమిస్తాడు. ఒక్క వికెట్ తీస్తే అతడి రికార్డు సమం అవుతుంది. ఒకవేళ రెండు వికెట్లు తీస్తే పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ రికార్డుల్లోకి ఎక్కుతాడు.
కీలక టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో తొలి టీ20లో ఆడలేదు. అయితే రెండో టీ20 మ్యాచ్‌లో దిగేది, లేనిది సమాచారం లేదు. నిజానికి తొలి టీ20 ఆడే భారత జట్టులో తొలుత చహల్ పేరు లేదు. మిచెల్ స్టార్క్ వేసిన చివరి ఓవర్‌లో బంతి హెల్మెట్‌కు తాకడంతో రవీంద్ర జడేజా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడికి ప్రత్యామ్నాయంగా చహల్ బరిలోకి వచ్చాడు. ఇక గాయపడిన జడేజా టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు.
కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన యుజ్వేంద్ర చహల్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆరోన్ ఫించ్ (35), స్టీవ్ స్మిత్ (12), మాథ్యూ వేడ్ (7) లాంటి కీలక బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. తన కోటా 4 ఓవర్లో 25 రన్స్ ఇచ్చి అద్భుత ప్రదర్శన చేసిన చహల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తొలి క్రికెటర్ చహల్ కావడం విశేషం.