హైదరాబాద్: టీమిండియాతో ఆడేటప్పుడు 90 శాతం ఆట సరిపోదని ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా పటిష్టంగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాను ఓడించాలంటే 100 శాతం ప్రదర్శన చేయాలని చెప్పుకొచ్చాడు.
గాయంతో తొలి రెండు వన్డేలకు ఆరోన్ ఫించ్ దూరమైన సంగతి తెలిసిందే. ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఆరోన్ ఫించ్ సెంచరీతో ఆస్ట్రేలియాకు భారీ స్కోరుని అందించాడు. ఐదు వన్డేల సిరిస్‌ను 3-0తో చేజార్చుకుని సిరిస్‌ను కోల్పోయింది.

అంతేకాదు ఐదు వన్డేల సిరిస్‌ను మరో రెండో వన్డేలు మిగిలుండగానే భారత జట్టుపై చేజార్చుకోవడం ఇదే తొలిసారి. నిజానికి ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ వచ్చిన అవకాశాలను ఆస్ట్రేలియా చేతులారా పోగొట్టుకుందనే చెప్పాలి. దీంతో ఆసీస్ వరుస ఓటములతో సిరిస్‌ను కోల్పోవడంపై ఫించ్ స్పందించాడు.
మంగళవారం ఫించ్ మీడియాతో మాట్లాడాడు. 'మ్యాచ్‌లు గెలవాలంటే సరైన దృక్పథంతో ఆడాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. తొలి మూడు వన్డేల్లో మేం బాగానే ఆడాం. చిన్న పొరపాటు చేస్తే చాలు భారత్ పదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిచేస్తుంది. ప్రస్తుతం మా రెండు జట్ల మధ్య చాలా అంతరం ఉంది. భారత్ 3-0తో ఆధిక్యంలో ఉంది. నెంబర్ వన్‌తో ఆడుతునప్పుడు ఆటగాళ్లతో ఆ అంతరం తగ్గిస్తే విజయాలు వస్తాయి. మ్యాచ్‌లు ఓడిపోతున్నప్పుడు ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది' అని ఫించ్ అన్నాడు.