పెర్త్: ఆస్టేలియాతో పోటీ అంటే నిప్పుతో చెలగాటమే అని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. జనవరి 12 నుంచి మొదలయ్యే 5 వన్డేలు, 3 టీ20ల సిరీస్ కోసం ధోనీసేన ఇప్పటికే ఆస్ట్రేలియా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో క్రికెట్ ఆడటంలో ఉన్న సవాలే వేరని తెలిపాడు. అలాంటి జట్టుతో పోటీ పడితే మన సత్తా ఏంటో తెలుస్తుందని చెప్పాడు. ఆస్టేలియాతో ఆడేటప్పుడు ఎంతో పోటీ తత్వం చూపించాలని చెప్పిన రోహిత్, భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గతంలో ఎన్నో ఆసక్తికర సిరిస్ మ్యాచ్‌లు జరిగాయన్నాడు.

రెండు జట్లు కూడా విజయం కోసమే గట్టిగా పోరాడతాయన్నారు. గత పర్యటనలోనూ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయన్నాడు. ఫలితాలు మాకు అనుకూలంగా రాకపోయినా, చివరిదాకా పోరాటం ఆపలేదని తెలిపారు. ఆస్టేలియాపై ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆడామని చెప్పాడు.
ఈసారి జరిగే సిరిస్‌లలో సారి కూడా అత్యుత్తమ ప్రదర్శన కొనసాగించనున్నట్లు చెప్పాడు. ఈ నెల 12 నుంచి అసలు సిరిస్ మొదలు కానుంది. అంతకు ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. పెర్త్ స్కార్చర్స్ అని కూడా పిలిచే వెస్టర్న్ ఆస్ట్రేలియాతో భారత్ శనివారం వన్డే వామప్ మ్యాచ్ ఆడుతుంది.