
సిడ్నీ: నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుంది. సిడ్నీలో క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా సన్నద్ధమవుతుంది. దీనిలో భాగంగా భారత ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. సీకే నాయుడు ఎలెవన్ జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించగా.. రంజిత్ సింగ్‌జీ ఎలెవన్ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసింది.
చిరు జల్లుల కారణంగా ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభం కావడం ఆలస్యమైంది. మ్యాచును 40 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ జట్టు తరఫున శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలో దిగారు. రాహుల్ 66 బంతుల్లో 83 రన్స్ చేయగా.. రంజిత్ సింగ్ జట్టు 235 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన సీకే నాయుడు జట్టు 35.4 ఓవర్లలోనే అయిదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
కోహ్లీసేన తరఫున ఓపెనర్లుగా పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్ దిగారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 58 బంతుల్లోనే 91 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ వికెట్ కీపింగ్ చేశాడని బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని బట్టి అర్థమవుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు చెలరేగారు. రాహుల్ 66 బంతుల్లో 83 పరుగులు చేయగా.. కోహ్లీ 58 బంతుల్లోనే 91 రన్స్ బాదాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.
విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రసవ సమయంలో భార్యకు తోడుగా ఉండేందుకు కోహ్లీ పితృత్వ సెలవు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17న మొదలయ్యే తొలి టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్నాడు. దీంతో ఆసీస్‌తో జరిగే కీలకమైన టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు.