
సిడ్నీ: ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే క్లీన్‌స్వీప్ చేసే అవకాశం భారత్ ముగింట నిలిచింది. ఆసీస్‌తో మంగళవారం మధ్యాహ్నం ఇక్కడ జరిగే చివరి మ్యాచ్‌లోనూ సత్తాచాటి పరిమిత ఓవర్ల ఘట్టాన్ని ఘనంగా ముగించాలని కోహ్లీసేన పట్టుదలగా ఉంది. 2016లో కంగూరూలపై పొట్టి సిరీస్‌ను 3-0తో పట్టేసిన భారత్.. మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని తహతహలాడుతున్నది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చివరి పంచ్ కూడా బలంగా ఇచ్చి ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో కొండంత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని భావిస్తున్నది.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఆసీస్ గడ్డపై భారత్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. అదేంటంటే.. రెండు లేదా అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లు కలిగిన టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేయడం. 2016లో ధోనీ సారథ్యంలో టీమిండియా 3-0 తేడాతో ఘన విజయం సాధించి ఆ జట్టును క్లీన్‌స్వీప్ చేయగా.. అంతకన్నా ముందే ఏంజిలో మాథ్యూస్ నేతృత్వంలోని శ్రీలంక 2013లో 2-0 తేడాతో చిత్తు చేసింది. దీంతో ఆస్ట్రేలియా సొంత గడ్డపైనే రెండుసార్లు వైట్‌వాష్‌కు గురైంది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ నడిపిస్తున్న భారత జట్టు సైతం అదే రికార్డుపై కన్నేసింది. ఇప్పటికే కాన్‌బెరా, సిడ్నీలో రెండు విజయాలు సాధించి పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ ఈరోజు జరిగే మూడో టీ20లోనూ గెలుపొందాలని చూస్తోంది. మూడో టీ20లో విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియాను మరోసారి క్లీన్‌స్వీప్ చేసినట్టు అవుతుంది. అంతేకాదు ధోనీ సరసన విరాట్ కోహ్లీ నిలుస్తాడు. భారత్ కూడా లంకతో సమానంగా నిలుస్తుంది. మరి ఈరోజు జరిగే మ్యాచులో కోహ్లీసేన గెలుస్తుందో లేదో చూడాలి.
గత 12 నెలల కాలంలో టీమిండియా ఒక్క టీ20 మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. 2019 డిసెంబర్ నెలలో ముంబై వేదికగా విండీస్‌పై విజయం సాధించిన భారత్.. 2020 ఆరంభంలో శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో గెలుపొందింది. అయితే గౌహతీలో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. న్యూజిలాండ్ పర్యటనలో 5-0 తేడాతో ఆతిథ్య జట్టును వైట్ వాష్ చేసిన భారత్.. తాజాగా ఆసీస్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.