హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 4 (శనివారం)న బెంగుళూరులో టీమిండియా రెండో టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. పూణెలో ఆడినంత చెత్త ఆట మళ్లీ రిపీట్ కాదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
పూణెలో ఘోర ఓటమిని చవిచూసినంత మాత్రాన మళ్లీ అదే ఫలితం పునరావృతం అవుతుందని అనుకోవడం పొరపాటని చెప్పాడు. నిజం చెప్పాలంటే పూణె టెస్టులో ఆస్ట్రేలియా తమకంటే మెరుగ్గా ఆడిందని, ఓటమిని అంగీకరించాలని అన్నాడు. భుజానికి గాయం కారణంగా రెండో టెస్టుకి ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా అందుబాటులో ఉండటం లేదని కోహ్లీ అన్నాడు.

బెంగుళూరులో జరగనున్న రెండో టెస్టు కోసం తమ జట్టులో కొన్ని ఊహించని నిర్ణయాలు తీసుకుంటామని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒక్కడే తమ టార్గెట్ కాదని, గత టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆ జట్టును ఆలౌట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కోహ్లీ గుర్తుచేశాడు.
ఇక తొలి టెస్టు ఓటమితో టీమిండియా ఒత్తిడిలో ఉందన్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్యలను సైతం విరాట్ కోహ్లీ తిప్పికొట్టాడు. అవన్నీ మైండ్‌గేమ్స్ అని నవ్వుతూ చెప్పాడు. 'నేను, మా టీమ్‌ను చూస్తే ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నామా? నేను చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నాను. నవ్వుతున్నాను. ఆసీస్ ఏం అనుకుంటున్నదానికంటే మా ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాం. ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడటంలో ఆసీస్ దిట్ట' అని కోహ్లీ అన్నాడు.
తమపై ఎలాంటి ఒత్తడి లేదని, హ్యాపీగా ఉన్నామని కోహ్లీ స్పష్టంచేశాడు. పూణెలో జరిగిన తొలి టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, కోహ్లీకి ముందు స్టీవ్ స్మిత్ మీడియాతో మాట్లాడాడు. పూణె టెస్టు ఓటమితో టీమిండియా తీవ్రమైన ఒత్తడిలో ఉందని వ్యాఖ్యానించాడు.
సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా 4-0తో సిరీస్ గెలుస్తుందని అన్నారని అయితే ఇప్పుడు వాళ్లే ఓ టెస్టుని ఓడారని చెప్పాడు. 'మరో మ్యాచ్ గెలిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మాదే. ఇక్కడ చాలా వేగంగా పరిస్థితులు మారిపోతాయి. ట్రోఫీకి ఒకటి, రెండు సెషన్ల దూరంలోనే మేం ఉన్నాం. ఓ మ్యాచ్ ఓడి సిరీస్‌లో పుంజుకోవాలన్న ఒత్తిడిలో భారత్ ఉంది' అని స్టీవ్ స్మిత్ అన్నాడు.