బ్రిస్బేన్: గాయాల బెడద కారణంగా ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్ బరిలోకి దిగే తుది జట్టును ఇప్పుడే ప్రకటించలేమని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో డిసైడర్ అయిన ఈ మ్యాచ్ శుక్రవారం నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ప్రతీ మ్యాచ్‌కు ఒక రోజు ముందుగానే జట్టును ప్రకటించిన టీమ్‌మేనేజ్‌మెంట్ ఈసారి మాత్రం అలా చేయలేదు. ఈ నేపథ్యంలో దానికి గల కారణాన్ని విక్రమ్ రాథోడ్ మీడియా సమావేశంలో వెల్లడించాడు.
బీసీసీఐ మెడికల్ టీమ్ నిరంతరం ఆటగాళ్ల గాయాలను పర్యవేక్షిస్తున్నారని, బుమ్రా ఆడే విషయం మ్యాచ్‌కు ముందే తెలుస్తుందన్నాడు. 'బీసీసీఐ మెడికల్ టీమ్ ఆటగాళ్ల గాయాలను పర్యవేక్షిస్తుంది. స్టార్ పేసర్ బుమ్రాను ఆడించే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. అతను సిద్ధంగా ఉన్నాడా? లేడా? అనేదాని కోసం రేపటి వరకు ఆగాల్సిందే. ఆఖరి టెస్టులో ఆడే 11 మంది ఎవరనేది ఇప్పుడే చెప్పలేం. చాలా మంది గాయాలతో సతమతమవుతున్నారు. రేపు ఉదయంలోగా మ్యాచ్‌లో ఆడే ఆటగాళ్లపై స్పష్టత వస్తుంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఆటగాళ్లు బాగా సన్నద్ధమవుతున్నారు. ఆటగాళ్లు మానసికంగా బలంగా ఉన్నారు. వాళ్ల సామర్థ్యంపై ఆటగాళ్లు నమ్మకంతో ఉన్నారు. అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తామని' రాథోడ్ వివరించారు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.
#TeamIndia batting coach Vikram Rathour on what makes the team mentally tough. #AUSvIND pic.twitter.com/IOUkkCcEQp
— BCCI (@BCCI) January 14, 2021
ఇక గాయాల కారణంగా చివరి టెస్టులో భారత్ అనేక మార్పులతో బరిలో దిగే అవకాశం ఉంది. భారత ప్రధాన పేసర్ బుమ్రా పొత్తి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దాంతో అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే బుమ్రా 50 శాతం ఫిట్‌గా ఉన్నా ఆడించాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఇక జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే బ్రిస్బేన్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని అశ్విన్ రూపంలో ఒకే స్పిన్నర్‌ను ఆడించి నాలుగో పేసర్‌ను తీసుకుంటే మాత్రం శార్దుల్ ఠాకూర్‌కు అవకాశం ఉంది. బుమ్రా చివరి నిమిషంలో తప్పుకుంటే నటరాజన్ అరంగేట్రం చేస్తాడు.