
మెల్‌బోర్న్: భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య త్వరలో ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల టిక్కెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాన్‌బెర్రాలో జరిగే మూడు వన్డేలు, సిడ్నీలో జరిగే మూడు టీ20ల మ్యాచ్‌ల టిక్కెట్లలను గత రెండు రోజులుగా విక్రయిస్తుండగా.. అవన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట. ఇక కేవలం 2 వేల కంటే తక్కువ టిక్కెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి కూడా అతిత్వరలోనే అమ్ముడుపోనున్నాయని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు.
కాన్‌బెర్రా, సిడ్నీ స్టేడియాల్లోనూ కరోనా మహమ్మారి నిబంధనల కారణంగా 50% టిక్కెట్లు మాత్రమే అమ్మకానికి ఉంచారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల్లో కరోనా అదుపులోనే ఉంది. త్వరలోనే పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు. దక్షిణాసియా ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియాలో టీమిండియా ఎప్పుడు పర్యటనకు వెళ్లినా.. టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయి. ఇండియాతో సిరీస్ అంటేనే క్రికెట్ ఆస్ట్రేలియాపై కాసుల వర్షం కురుస్తోంది.
తొలి టెస్ట్ వేదికైన అడిలైడ్‌లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. కరోనా వైరస్ కేసులు భారీగా వస్తుండటంతో ఇక్కడి అధికారులు బుధవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. దీంతో తొలి టెస్ట్ అడిలైడ్‌లో జరుగుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే తప్పుడు సమాచారంతో తాము ఈ లాక్‌డౌన్ విధించామని, త్వరలోనే దానిని ఎత్తేయనున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో తొలి టెస్ట్ షెడ్యూల్ ప్రకారం అడిలైడ్‌లోనే జరగనుంది.
నవంబర్ 27 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోజు నుంచి కోహ్లీసేన ముమ్మురంగా సాధన చేస్తోంది. గురువారం సైతం ఆటగాళ్లు నెట్స్‌లో కఠోరంగా శ్రమించారు. సమయానికి మించి శిక్షణ పొందుతున్నారు. అయితే వన్డే, టీ20 సిరీస్‌లకి ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలను దూరంగా ఉంచాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోందట. రొటేషన్ పద్దతిలో భాగంగా వారికి విశ్రాంతిని ఇవ్వాలని చూస్తోందట.