
ముంబై: ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 13 పరుగులతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి పరిమితం చేయగలిగింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 302 పరుగులు చేసింది. అయితే భారీ స్కోర్ చేయడానికి ప్రధాన కారణం స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలే. 152 పరుగులకే కీలక 5 వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియా.. ఒక దశలో 200 పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ ఆరో వికెట్‌కు పాండ్యా (92; 76 బంతుల్లో, 7×4, 1×6), జడేజా (66; 50 బంతుల్లో, 5×4, 3×6)లు కలిసి ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. వీరిద్దరు కలిసి 6వ వికెట్‌కు 108 బంతుల్లోనే 150 పరుగులు జోడించారు.
మూడో వన్డేలో భారత్‌ని గెలిపించిన హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మరీ ముఖ్యంగా పాండ్యాపై. మ్యాచ్ గమనానికి అనుగుణంగా పాండ్యా హిట్టింగ్ చేశాడని పేర్కొన్నాడు. తాజాగా గవాస్కర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'మూడో వన్డేలో హార్దిక్ పాండ్యా చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. అతని ఆటలో పరిపక్వత కనిపించింది. తొలి వన్డేలో 90 పరుగుల వద్ద ఔటయ్యాడు. మూడో వన్డేలో విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత.. తాను చివరి వరకూ క్రీజులో ఉండాల్సిన అవసరాన్ని హార్దిక్ గుర్తించాడు' అని అన్నాడు.
'క్లిష్ట దశలో జడేజాతో కలిసి హార్దిక్ బాధ్యతాయుతంగా ఆడి మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఆకట్టుకుంది. 42వ ఓవర్ వరకూ ఆచితూచి ఆడిన ఇద్దరూ.. ఆ తర్వాత గేర్ మార్చడం మ్యాచ్‌లో కీలక మలుపు. చెత్త బంతుల్ని మాత్రమే ఫోర్లు, సిక్సర్లుగా మలిచిన తీరు అద్భుతం. ఏమాత్రం ఛాన్స్ దొరికినా.. వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతూ సింగిల్‌ని డబుల్‌గా మార్చేశారు. కొన్నిసార్లు నేరుగా ఫీల్డర్ చేతులోకి బంతి వెళ్లినా.. సూపర్ అథ్లెట్స్ తరహాలో ఈ ఇద్దరూ వికెట్ల మధ్య పరుగు తీశారు. మొత్తానికి వారి ప్రదర్శన సూపర్' అని సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు.
జడేజా-హార్దిక్ జోడీ చివర్లో వరుస బౌండరీలతో చెలరేగిపోయింది. 42 బంతుల్లో 93 పరుగుల్ని పిండుకున్నారు. ఈ క్రమంలోనే 6వ వికెట్‌కు 108 బంతుల్లోనే 150 పరుగులు జోడించారు. 1999లో ఆస్ట్రేలియాపై రాబిన్ సింగ్, శఠగోపన్ రమేశ్‌లు 6వ వికెట్‌కు 123 పరుగుల జోడించడం ఇప్పటివరకు రికార్డుగా ఉండేది. తాజాగా ఆ రికార్డును 21 ఏళ్ల తర్వాత రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలు కలిసి సవరించారు. ఓవరాల్‌గా చూసుకుంటే పాండ్యా, జడేజా జోడి ఆసీస్‌పై చేసిన 150 పరుగుల భాగస్వామ్యం మూడవ స్థానంలో ఉంది. అంబటి రాయుడు, స్టువర్ట్ బిన్నీ కలిసి 2015లో జింబ్వాబేతో జరిగిన వన్డేలో 6 వికెట్‌కు 160 పరుగులు జోడించి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ జోడి రెండో స్థానంలో నిలిచింది. వీరిద్దరు కలిసి 2005లో జింబ్వాబేపై 6వ వికెట్‌కు 158 పరుగుల జోడించారు.