
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021కు ముందు టీమిండియాతో జరుగుతున్న సన్నాహక మ్యాచులో ఆస్ట్రేలియా మోస్తరు స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసి.. టీమిండియా ముందు 153 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (57; 48 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీ చేశాడు. హిట్టర్లు మార్కస్ స్టోయినిస్ (41; 25 బంతుల్లో 4x4, 1x6), గ్లేన్ మ్యాక్స్‌వెల్ (37; 28 బంతుల్లో 5x4) పర్వాలేదనిపించారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (1), ఆరోన్ ఫించ్ (8)లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, రాహుల్, భువనేశ్వర్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారీ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన అశ్విన్ వరుస బంతుల్లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్షలను ఔట్ చేశాడు. రెండో ఓవర్ ఐదో బంతికి వార్నర్‌ను ఎల్బీగా వెనక్కి పంపిన అశ్విన్.. ఆ తర్వాతి బంతికి మార్ష్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ 2 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. జడేజా వేసిన నాలుగో ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్ కష్టాల్లో పడింది.
ఈ సమయంలో స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ ఇద్దరు భారీ షాట్లు ఆడకున్నా.. స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆసీస్ స్కోర్ బోర్డును ముందుకునడిపారు. ఐపీఎల్ 2021 నుంచి ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్.. భారత బౌలర్ల దాటికి సిక్సులు కొట్టలేకపోయాడు. ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన అనంతరం మ్యాక్సీ ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ అండతో స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. ఈ క్రమంలోనే 41 బంతులెదుర్కొన్న స్మిత్.. 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు స్టోయినిస్ బ్యాట్ జులిపించాడు. చివరి ఓవర్లో స్మిత్ ఔట్ అయ్యాడు. ఇనింగ్స్ చివరలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆసీస్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 2.. రాహుల్ చహర్, భువనేశ్వర్, జడేజా తలా ఒక వికెట్ తీశారు.