ముగిసిన తొలిరోజు ఆట.. పకోస్కీ, లబుషేన్ హాఫ్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా!!

సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య ప్రారంభం అయిన మూడో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసిసేసరికి ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా కొనసాగుతోంది. ఆసీస్ 55 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (5) నిరాశపరచగా.. ఆరంగేట్ర యువ ఓపెనర్ విల్ పకోస్కీ (62; 110 బంతుల్లో 4x4) ఆకట్టుకున్నాడు. మార్నస్ లబుషేన్ (67; 149 బంతుల్లో 8x4) అర్ధ శతకం సాధించగా.. స్టీవ్ స్మిత్ (31; 64 బంతుల్లో 5x4) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మొహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ చెరో వికెట్ పడగొట్టారు.

సిరాజ్ శుభారంభం
గురువారం ఉదయం వర్షం అంతరాయం కలిగించడం వలన కాస్త ఆలస్యంగా ఆట ప్రారంభం అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ గట్టి షాక్ ఇచ్చాడు. అద్భుత బంతితో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను పెవీలియన్‌కు పంపాడు. జట్టు స్కోరు 6 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్‌లో వార్నర్ స్లిప్‌లో చేటేశ్వర్ పూజారా చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి మార్నస్ లబుషేన్ వచ్చాడు. ఆస్ట్రేలియా 7.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసిన సమయంలో వరణుడు అడ్డుపడడంతో మ్యాచ్ ఆగిపోయింది. దీంతో అరగంట ముందే లంచ్ బ్రేక్ ఇచ్చారు.

పకోస్కీ హాఫ్ సెంచరీ
సుమారు నాలుగు గంటల విరామం తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభం అయింది. లంచ్ తర్వాత విల్ పకోస్కీ, మార్నస్ లబుషేన్‌లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. చెత్త బంతిని మాత్రమే బౌండరీకు తరలించారు. అయితే ఇద్దరు బ్యాట్స్‌మెన్స్‌కు చెరో లైఫ్ లభించింది. పకోస్కీ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వికెట్ కీపర్ రిషబ్ పంత్ జార విడిచాడు. దీంతో ఇద్దరూ ఆసీస్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. భారత కెప్టెన్ బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది. పకోస్కీ తన ఫస్ట్ క్లాస్ ఫామ్ కొనసాగిస్తూ.. అంతర్జాతీయ తొలి టెస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆసీస్ టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోయి 93 పరుగులు చేసింది.

లబుషేన్ అర్ధ శతకం:
భారత బౌలర్లను ఎదుర్కొంటూ పకోస్కీ, లబుషేన్ శతక భాగస్వామ్యం నిర్మించారు. అర్ధశతకం పూర్తి చేసుకొని ధాటిగా ఆడుతున్న పకోస్కీని నవదీప్ సైనీ వికెట్ల ముందు దొరకబుచ్చుకొని రెండో వికెట్ తీశాడు. అప్పటికి ఆసీస్ స్కోర్ 106/2కి చేరింది. ఆపై క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ధాటిగా ఆడాడు. బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు లబుషేన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. తొలి రోజు ఆట పూర్తయ్యే సమయానికి ఈజోడి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 55 ఓవర్లకు 166/2తో నిలిచింది.

144 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే
సిడ్నీ క్రికెట్ మైదానంలో జరుగుతోన్న మూడో టెస్టుకు పోలోజాక్ నాలుగో అంపైర్‌గా వ్యవహరించి చరిత్ర సృష్టించారు. పురుషుల టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో ఓ మహిళా అంపైర్‌గా విధులు నిర్వర్తించడం 144 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. వరల్డ్ క్రికెట్ లీగ్‌లో భాగంగా 2019లో నమీబియా, ఒమన్‌ల మధ్య ఐసీసీ డివిజన్-2 పురుషుల వన్డే మ్యాచ్‌కు ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా ఆమె పనిచేశారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆతిథ్య జట్టు తమ ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్ అంపైర్ల నుంచి నాలుగో అంపైర్‌ను నియమించుకోవచ్చు. దీంతో 32 ఏళ్ల పోలోజాక్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అవకాశాన్ని ఇచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IPL 2021: ఫిబ్రవరి 11న మినీ వేలం.. భారత్‌లోనే టోర్నీ!!