
ఎన్సీఏలో అధికారుల సమావేశం
ప్రస్తుతం రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రాహుల్ ద్రవిడ్ సమక్షంలో శిక్షణ పొందుతున్నారు. ఇద్దరూ ఫిట్నెస్ ట్రైనింగ్ పొందుతున్నారు. ముందుగా టెస్ట్ సిరీస్ కోసం వీరిద్దర్నీ బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఆ తర్వాత ఫిట్నెస్ సాధిస్తే జట్టులోకి తీసుకుంటాం అని చెప్పింది. ఎన్సీఏలో శిక్షణ పొందుతున్న వీరి ఫిట్నెస్ను నిశితంగా గమనిస్తామని బీసీసీఐ ప్రకటించింది. రోహిత్, ఇషాంత్ ఫిట్నెస్ విషయమై ఎన్సీఏలో అధికారులు ఇటీవలే సమావేశమై చర్చించారు. ఈ ఇద్దరి రిపోర్టులు ఆశాజనకంగా లేవని తెలుస్తోంది.

అనధికారికంగా సమాచారం
రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో బరిలో దిగే అవకాశాలు లేవని టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లు, బోర్డుకు ఎన్సీఏ నిపుణులు అనధికారికంగా సమాచారం అందించారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉందట. ఇదే నిజమయితే టీమిండియాకు భారీ షాక్ తగలనుంది. ఓపెనర్‌గా రోహిత్ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇషాంత్ కూడా టీమిండియాకు ప్రధాన పేస్ బలం. మరి ఈ ఇద్దరూ ఆసీస్ వెళతారో లేదో చూడాలి.

3-4 రోజుల్లో బయలుదేరాలి
రోహిత్, ఇషాంత్ ఫిట్నెస్ విషయమై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆదివారం మాట్లాడుతూ.. ఈ ఇద్దరు క్రికెటర్లు టెస్టు సిరీస్ ఆడాలంటే 3-4 రోజుల్లో ఆస్ట్రేలియా బయల్దేరి రావాల్సి ఉంటుందన్నాడు. 'రోహిత్ వైట్ బాల్ సిరీస్‌లకు లేడు. అతడు ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలనే విషయంపై ఎన్సీఏ మెడికల్ టీం ఆలోచిస్తున్నారు. కానీ అతడికి ఎక్కువ కాలం విశ్రాంతి కూడా ఇవ్వలేం.
టెస్టు సిరీస్‌కు ఆడాలనుకుంటే.. రోహిత్ 3-4 రోజుల్లో బయలుదేరాలి. లేనిపక్షంలో అవకాశాలు కఠినంగా మారుతాయి. అయితే ఆసీస్‌కు బయలుదేరడానికి ఎక్కువ సమయం తీసుకుంటే క్వారంటైన్ నిబంధనలతో తర్వాత సవాలుగా మారుతుంది. అప్పుడు టెస్టు సిరీస్‌కు ఆడే అవకాశాలు సంక్లిష్టం అవుతాయి' అని రవిశాస్త్రి తెలిపాడు.

14 రోజుల పాటు క్వారంటైన్
రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు ఎప్పుడు ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్తారనేది ఇప్పటి వరకూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించలేదు. వెళతారో లేదో కూడా తెలియదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీంతో వారిద్దరూ సోమవారమే ఆసీస్ బయల్దేరకపోతే.. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే తొలి వార్మప్ మ్యాచ్‌కు దూరం అవుతారు.