

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన కోహ్లీసేనపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.
టీమిండియా సాధించిన ఈ అరుదైన రికార్డుపై భారత మాజీలతో పాటు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్‌తో పాటు పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియాను ఒకప్పటి బౌలింగ్ దిగ్గజం వసీమ్ అక్రమ్ అభినందించాడు. 'ఈ అత్యద్భుత ప్రదర్శనకు గాను విరాట్ కోహ్లీ ప్రశంసలకు అర్హుడు. భారత్‌లోని పటిష్ట దేశవాళీ క్రికెట్ విధానం వల్లే ఈ విజయం సాధ్యమైందని అనుకుంటున్నా' అని అన్నాడు.
"ఆస్ట్రేలియా గడ్డమీద ఆస్ట్రేలియాను ఓడించడం చాలా కష్టమని, అయినా టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత్‌ను అభినందించాల్సిందే. పుజారా, పంత్, కోహ్లీ బ్యాటింగ్, బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ విజయం సాదించింది" అని పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ అన్నాడు. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఈ విజయం సాధ్యమైందని వెల్లడించాడు.
"ఈ సిరీస్‌లో పుజారా, కోహ్లీ, పంత్, మిగతావారి బ్యాటింగ్ ఆకట్టుకుంది. బౌలర్లు ఒత్తిడి పడకుండా బంతులు వేసేందుకు వారు బాటలు వేశారు" అని మొయిన్ ఖాన్ పేర్కొన్నాడు.